సిగ్నలింగ్ పనుల్లో జాగ్రత్త అవసరం

12 Dec, 2016 15:24 IST|Sakshi
సిగ్నలింగ్ పనుల్లో జాగ్రత్త అవసరం

రైల్వే బోర్డు డెరైక్టర్ జనరల్ అఖిల్ అగర్వాల్
 
 సాక్షి, హైదరాబాద్: రైల్వేలో సిగ్నలింగ్, టెలికం వ్యవస్థల లక్ష్యం భద్రతే అరుునందున దానికి సంబంధించిన పనులను జాగ్రత్తగా నిర్వహించాలని రైల్వే బోర్డు డెరైక్టర్ జనరల్ (సిగ్నల్, టెలికం) అఖిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ పనులు ప్రామాణికంగా ఉంటున్నాయా? లేదా? అన్న విషయాన్ని బాధ్యులైన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఆదివారం రైల్ నిలయంలో అఖిల భారత రైల్వే సిగ్నల్, టెలికం ఇంజనీర్ల సమావేశంలోనూ.. అలాగే తార్నాకలోని ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలి కమ్యూనికేషన్‌‌స(ఇరిసెట్) 59వ వార్షికోత్సవంలోనూ అఖిల్ అగర్వాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైల్వే రవాణాలో కీలక మార్పులు తేవడంలో ఇరిసెట్ అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.

సిగ్నలింగ్ వ్యవస్థ మరింత పటిష్టమైన సేవలు అందించేందుకు కావాల్సిన నిపుణులకు తర్ఫీదును ఇవ్వడంలో తన వంతు పాత్ర పోషిస్తోందన్నారు. 1957లో ప్రారంభమైన ఇరిసెట్ ఇప్పటి వరకు సుమారు 7,260 మందికి సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణలో శిక్షణ ఇచ్చిందన్నారు. ఇక్కడ 121 కోర్సుల్లో శిక్షణ ఇస్తూ.. సిగ్నలింగ్ వ్యవస్థలో నూతన మార్పులకు ఇరిసెట్ శ్రీకారం చుట్టిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. సిగ్నలింగ్ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఇరిసెట్ సేవలను మరింత విస్తరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇరిసెట్ సావనీర్‌ను విడుదల చేశారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థలో ఉత్తమ సేవలు అందించిన 18 మంది అధికారులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో రైల్వే బోర్డు అదనపు సభ్యుడు(సిగ్నలింగ్) కాశీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు అరవింద్ మిట్టల్, గోయల్, శోభన్ చౌదరి, సునీల్‌గుప్తా, ఇరిసెట్ డెరైక్టర్ ఎంఎస్ మహబూబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు