దేశ సమైక్యత కోసం పునరంకితం కావాలి

20 Aug, 2016 02:10 IST|Sakshi
దేశ సమైక్యత కోసం పునరంకితం కావాలి

* స్వరాజ్యాన్ని సురాజ్యం చేద్దాం.. రామరాజ్యం దిశగా సాగుదాం
* భారతమాత అంటే భారత దేశ ప్రజలంతా...
* కవులు, కళాకారుల ఇష్టాగోష్టిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్: దేశ అభివృద్ధికి, సమైక్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 70 ఏళ్ల స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆకలి, అవినీతి, అంటరానితం, వివక్ష, పేదరికం వంటి అసమానతలు లేని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లే రామరాజ్యం దిశగా సాగాలని సూచించారు.

స్వాతంత్య్ర సప్తతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘స్వాతంత్య్ర సప్తతి-సాయం సంధ్య’ కవులు, కళాకారుల ఇష్టాగోష్టి కార్యక్రమానికి వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ మురళీమోహన్, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రామచంద్రారావు, ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ సినీదర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రముఖ నటుడు, కవి తనికెళ్ల భరణి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్‌వీ సత్యనారాయణ, ఆచార్య ఎన్.గోపి, గజల్ గాయకుడు శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడానికి పరిమితం కాకుండా.. 70 ఏళ్ల స్వరాజ్య ఫలితాలను విశ్లేషించుకోవలసిన అవ సరముందని అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్ర కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని, సమర యోధుల త్యాగాలను, పోరాటాలను స్మరించుకోవలసి ఉందన్నారు. దేశభక్తి అంటే దేశ పటానికి మొక్కడం, భరతమాత చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని, దేశంలోని ప్రజలందరి పట్లా ప్రేమను కలిగి ఉండడమని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఇంకా కులం, భాష, ప్రాంతీయ విబేధాలు, అక్కడక్కడా అంటరానితనం, దళితులు, అణగారిన వర్గాలు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

బాల్య వివాహాలు, వరకట్న దురాచారాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇలాంటి సాంఘిక రుగ్మతలను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని చీల్చే ఉగ్రమూకలను సమర్థించే శక్తులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వారికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కవులు, కళాకారులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు పసికంటి వీరాస్వామీజీ, డాక్టర్ టీవీ నారాయణ, పీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, రాధాకృష్ణ, రాంచంద్రారెడ్డి, మల్లమ్మ, సుఖ్‌దేవ్‌ఆర్య తదితరులను ఘనంగా సన్మానించారు.
 
ఉత్తేజపరిచిన దేశభక్తి గీతాలు
కార్యక్రమంలో కవుల కవితలు, పాటలు దేశభక్తిని నింపాయి. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆవిష్కరించాయి. కీరవాణి ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట పాడారు. మేజర్ చంద్రకాంత్ సినిమా తనకు గొప్ప సంతృప్తినిచ్చిందని, గాంధీ సినిమా తీయలేకపోయాననే బాధను పోగొట్టిందని రాఘవేంద్రరావు అన్నారు. మాడుగుల నాగఫణిశర్మ, యూఖూబ్, ఆచార్య ఎన్ గోపీ, తనికెళ్ల భరణి, ఎస్‌వీ సత్యనారాయణ, డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, గంగాధరశాస్త్రీ, డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, భారవి, డాక్టర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, శిలాశ్రీ తదితరులు తమ కవితలు వినిపించారు. సామల వేణు ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని వార్తలు