ప్రాణహితపై ప్రతిపక్షాల దుష్ర్పచారం

28 Mar, 2016 04:24 IST|Sakshi
ప్రాణహితపై ప్రతిపక్షాల దుష్ర్పచారం

జాతీయ హోదా, 18 అనుమతులు రాలేదు: హరీశ్
♦ వచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
♦ లేకుంటే ప్రతిపక్ష సభ్యులు రాజీనామా చేస్తారా అని సవాల్
 
 సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ఆకృతి మార్పునకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు షబ్బీర్‌అలీ, రంగారెడ్డి అడిగిన ప్రశ్నలపై చర్చ సందర్భంగా ఆదివారం శాసనమండలిలో ఇరుపక్షాల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రాణహిత పాత డిజైన్‌కు కేంద్రం నుంచి 18 అనుమతులు, జాతీయ హోదా లభించినట్లు రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని, లేకుంటే ప్రతిపక్ష సభ్యులు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 5 అనుమతులు మాత్రమే వచ్చాయని, జాతీయ హోదా విషయమై పరిశీలిస్తామని మాత్రమే రాష్ట్ర పునర్విభజన బిల్లులో పేర్కొన్నారని చెప్పారు. క్లియరెన్సులు అన్నీ ఉంటే ఏడేళ్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి వద్ద సరిపడినంత నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ వద్దకు ప్రాజెక్టును రీడిజైన్ చేశామని తెలిపారు. ప్రాజెక్ట్ రీడిజైన్‌తో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించగలుగుతామని, రెండు పంటలు పండించేందుకు వీలవుతుందన్నారు. ప్రాజెక్ట్‌పై గత ప్రభుత్వం పెట్టిన ఖర్చును 99 శాతం వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ పేరును మార్చబోమని.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

 రెండేళ్లలో భూముల సమగ్ర సర్వే: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
 రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర సర్వేను త్వరలోనే చేపట్టి రెండేళ్లలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రకటించారు. మండలిలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి జవాబిస్తూ.. జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద రూ.254 కోట్లతో సర్వే ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

వంట నూనెల కల్తీ విస్తరణపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లకా్ష్మరెడ్డి బదులిస్తూ.. కల్తీని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులతో చర్చించి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలకు సంబంధించి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు జవాబిస్తూ.. జాతీయ రహదారులపై 999 మద్యం దుకాణాలు, 281 బార్లు ఉన్నాయని, రహదారుల భద్రత విషయమై సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని చెప్పారు. పేద రైతులను పీడిస్తున్న ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వ పరంగా చర్యలు చేపడతామని.. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహమూద్ అలీ చెప్పారు.

 గ్రూప్-2లో మరో 439 ఖాళీలు: ఈటల
 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు, అధికారుల విభజన ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ పూర్తి చేస్తేనే ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలవుతుందని.. బీజేపీ ఎమ్మెల్సీ రాం చంద్రరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ముందుగా ప్రకటించినట్లు లక్ష ఉద్యోగాలను భర్తీ చే సేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటికే 11 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 14 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, త్వరలోనే 10 వేల టీచర్ల నియామక ప్రక్రియ చేపట్టబోతున్నామని చెప్పారు. గ్రూప్-1 కింద 49, గ్రూప్-2 కింద 439 ఖాళీలను ప్రకటించడానికి టీఎస్‌పీఎస్సీకి అనుమతినిచ్చినట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. దేవాలయ భూములకు సంబంధించి ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానమిస్తూ.. రాష్ట్రంలోని 2,924 దేవాలయాల కింద మొత్తం 84,730 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో 14,030 ఎకరాలు అన్యాక్రాంతమైందని తెలిపారు. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా ఆ భూములను సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

>
మరిన్ని వార్తలు