న్యూడెమోక్రసీ నేత కన్నుమూత

10 Mar, 2016 04:38 IST|Sakshi
న్యూడెమోక్రసీ నేత కన్నుమూత

గుండెపోటుతో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ మృతి
♦ పార్టీ కార్యవర్గ భేటీలో గుండెపోటుతో కుప్పకూలిన నేత
♦ హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత
♦ 47 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపిన రాయల
♦ నేడు స్వగ్రామం పిండిప్రోలులో అంత్యక్రియలు
 
 సాక్షి, హైదరాబాద్/ఖమ్మం మయూరి సెంటర్: నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న సీపీఐ (ఎంఎల్-న్యూ డెమోక్రసీ) అగ్రనేత రాయల సుభాష్ చంద్రబోస్(70) అలియాస్ రవన్న బుధవారం గుండెపోటుతో మరణిం చారు. ఖమ్మం జిల్లాలో ఓ రహస్య ప్రాంతంలో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. హుటాహుటిన హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో నకిరేకల్ వద్ద తుదిశ్వాస విడిచినట్టు న్యూడెమోక్రసీ వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య కె.రమ, కుమార్తె వందన ఉన్నారు. రమ పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. బోస్ భౌతికకాయాన్ని విద్యానగర్‌లోని న్యూడెమోక్రసీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఉదయం ఖమ్మం తరలించి స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల దాకా అభిమానుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారని పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు.

 విద్యార్థి దశ నుంచే...
 ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు బోస్ స్వగ్రామం. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీలో బీఎస్సీ చదివారు. కాలేజీలో బత్తుల వెంకటేశ్వరరావుతో కలసి స్టూడెంట్స్ ఫెడరేషన్‌ను స్థాపిం చారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. 1967 నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమాల ప్రభావంతో చదువుకు స్వస్తి చెప్పి విప్లవబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. 1968లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్నుంచీ అజ్ఞాత జీవితాన్ని వీడలేదు. 1972 దాకా చారు మజుం దార్ అనుచరునిగా సీఓసీలో పనిచేశారు. ప్రముఖ విప్లవకారుడు చండ్ర పుల్లారెడ్డి ఏర్పాటు చేసిన సీపీఐఎంఎల్ (సీపీ)లో చేరారు.

1984లో చండ్ర వర్గం చీలిపోయినప్పుడు పైలా వాసుదేవరావు నాయకత్వాన ఏర్పాటైన సీపీఐ ఎంఎల్ (ప్రజాపంథా)లో చేరారు. తర్వాత పార్టీకి కార్యదర్శిగా పని చేశారు. కూర రాజన్న నాయకత్వంలోని జనశక్తి, ప్రజాపంథా గ్రూపులు విలీనమై సీపీఐ (ఎంఎల్-న్యూడెమోక్రసీ)గా ఏర్పాటయ్యాక ఆ పార్టీకి కార్యదర్శిగా పని చేశారు. గత ఏడాది న్యూడెమోక్రసీ కూడా చీలిపోయింది. ఒక వర్గానికి బోస్ కార్యదర్శిగా ఉన్నారు. 2009లో బోస్‌కు పక్షవాతం రావడంతో చికిత్స తీసుకుం టున్నారు. బోస్ మరణం పట్ల సీపీఐ (ఎంఎల్-న్యూ డెమోక్రసీ) నేతలు గాదె దివాకర్, జి.ఝాన్సీ, కె.గోవర్ధన్, వేములపల్లి వెంకట్రామయ్య, డి.వి.కృష్ణ, పి.రంగారావు, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

 ఆ కుటుంబం విప్లవోద్యమానికే అంకితం
 రాయల తండ్రి వెంకట నారాయణ తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు. ఈయనకు నలుగురు కుమారులు. పెద్దవాడైన అప్పయ్య ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేశారు. రెండో సంతానం రాయల. మూడో కుమారుడు నాగేశ్వరరావు పిండిపోలు గ్రామానికి 30 సంవత్సరాల పాటు సర్పంచ్‌గా ఉన్నారు. నాలుగో సంతానమైన చంద్రశేఖర్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, రైతు కూలీ సంఘం నాయకులుగా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు