'కొత్త జిల్లాల ప్రకటనను వాయిదా వేయాలి’

21 Sep, 2016 19:31 IST|Sakshi

హైదరాబాద్: శాసనసభలో చర్చించి, నిర్ణయం తీసుకునే వరకు జిల్లాల విభజనపై తుది ప్రకటనను వాయిదా వేయాలని బీజే ఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం విశ్వాసమున్నా జిల్లాల ఏర్పాటు ఏకపక్షంగా జరపొద్దన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వీటిపై అసెంబ్లీలో చర్చించకుండా జిల్లాల ప్రకటన చేయవద్దని గట్టిగా సూచించారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాలులో విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 20 నుంచి పది పనిదినాలు అసెంబ్లీ జరిగే విధంగా స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించగా, దానిని కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ప్రొరోగ్ చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

దీనిపై బీఏసీలో, ఇతర పక్షాలతో చర్చించకుండా సీఎం ఇచ్చిన మాటను ఆయనే ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, శాసనసభ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. స్పీకర్‌ను అవమానించేలా వ్యవహరించిందన్నారు. అసెంబ్లీ ద్వారా కాకుండా ఆర్డినెన్స్‌ల ద్వారా భూసేకరణ చట్టానికి సవరణలు, బీసీ కమిషన్ ఏర్పాటు, నిజామాబాద్,కరీంనగర్ కమిషనరేట్ల ఏర్పాటునకు ప్రభుత్వం ఈ చర్యకు దిగిందన్నారు. పార్టీ పిరాయింపులపై హైకోర్టు చేసిన సూచనలను స్పీకర్ పరిగణలోకి తీసుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు.

హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా ఉంది..
రోడ్లు పూర్తిగా దెబ్బతిని, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా తయారైందని కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రోడ్లు నరకానికి దారులుగా మారాయన్నారు. మున్సిపల్ మంత్రి ఉత్తర కుమార ప్రగల్భాల మాదిరిగా రోడ్లను అదిచేస్తాం ఇది చేస్తామన్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. వంద రోజుల్లో మొత్తం పరిస్థితిని మార్చేస్తామని, రోడ్లను అద్దంగా మారుస్తామని మంత్రి చెప్పారన్నారు. కొత్త రోడ్లు వేయడం మాట అటుంచి, కనీసం రోడ్లపై పడిన గుంతలను పూడ్చడానికి ఏమైందని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం లేదా మంత్రి వైఫల్యమా లేక జీహేచ్‌ఎంసీ యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదా అని నిలదీశారు.

>
మరిన్ని వార్తలు