కొత్త జిల్లాలు.. అభివృద్ధి జోన్లు

19 Aug, 2016 01:13 IST|Sakshi
కొత్త జిల్లాలు.. అభివృద్ధి జోన్లు

భవిష్యత్తు వ్యూహంతోనే ఖరారు చేసిన సర్కారు
* చిన్న జిల్లా హైదరాబాద్.. పెద్ద జిల్లా కొత్తగూడెం
* గిరిజన జిల్లాగా మహబూబాబాద్
* ఆధ్యాత్మిక, ఆలయాల జిల్లాగా యాదాద్రి
* ఆదివాసీల జిల్లాగా కొమురం భీమ్
* అటవీ ప్రాంత జిల్లాగా భూపాలపల్లి
* కొత్త జిల్లాల్లో కొత్తగా 14 రెవెన్యూ డివిజన్లు

సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కీలకమైన అభివృద్ధి జోన్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల జాబితాను రూపొందించింది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చింది. సౌలభ్యంతోపాటు, సుపరిపాలనకు వీలుగా కసరత్తు చేసింది. తెలంగాణలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో పాటు వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉండేలా కొత్త జిల్లాలను రూపొందించింది.

గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌ను గిరిజన జిల్లాగా, మంచిర్యాల కేంద్రంగా ఏర్పాటు చేసే కొమురం భీమ్ జిల్లాను ఆదివాసీ జిల్లాగా, భూపాలపల్లిని అటవీ ప్రాంత జిల్లాగా గుర్తించింది. దేవాలయాలతో కూడిన ఆధ్యాత్మిక జిల్లాగా యాదాద్రిని రూపొందించింది. వెనుకబడిన ప్రాంతాల జిల్లాలుగా వనపర్తి, నాగర్‌కర్నూల్‌లను చేర్చింది. కాకతీయుల తొలి రాజధానిగా చారిత్రక ప్రాధాన్యమున్న హన్మకొండను, హైదరాబాద్‌ను హెరిటేజ్ జిల్లాలుగా గుర్తించనుంది. పారిశ్రామిక సెజ్, ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌కు ఆర్థిక వనరుల కేంద్రంగా ప్రాధాన్యమిచ్చింది.

వీటితో పాటు జాతీయ రహదారులపై ఉన్న పట్టణాలను జిల్లా కేంద్రాలుగా మారిస్తే.. శరవేగంగా అభివృద్ధి చెందుతాయని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ఉన్న ప్రధాన రహదారుల వెంట ఉన్న పట్టణాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలోనే కామారెడ్డి, సిద్ధిపేట, పెద్దపల్లి, వికారాబాద్, మెదక్‌లను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు.

తక్కువ జనాభా జిల్లా భూపాలపల్లి
ముఖ్యమంత్రి ఆమోదించిన 27 జిల్లాలకు సంబంధించిన విస్తీర్ణం, జనాభా, వాటిలో మండలాల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. విస్తీర్ణపరంగా చూస్తే కొత్తగూడెం పెద్ద జిల్లాగా, హైదరాబాద్ చిన్న జిల్లాగా నిలవనున్నాయి. 8,044.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కొత్తగూడెం జిల్లా ఉండనుంది. తర్వాత స్థానంలో మంచిర్యాల (కొమురం భీమ్) జిల్లా ఉంది. కేవలం 174.63 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హైదరాబాద్ అతి చిన్న జిల్లాగా ఉండనుంది. అతి తక్కువ జనాభా ఉండే జిల్లాలుగా భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి ఆవిర్భవించనున్నాయి. కేవలం 6.95 లక్షల జనాభాతో ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా ఏర్పాటు కానుంది.

7.09 లక్షల జనాభాతో నిర్మల్, 7.37 లక్షల జనాభాతో పెద్దపల్లి, 7.54 లక్షల జనాభాతో మహబూబాబాద్ జిల్లాలు ఏర్పడనున్నాయి. హైదరాబాద్ జిల్లా అత్యధికంగా 39.43 లక్షల జనాభాతో అగ్రస్థానంలో ఉంటుంది. కొత్త జిల్లాల్లో ఉండే అన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి వీలైనంత దగ్గరలో ఉండేలా కసరత్తు చేయడంతో... మండలాల సంఖ్య సైతం జిల్లాకో తీరుగా మారింది. అతి తక్కువగా ఏడు మండలాలతో మల్కాజ్‌గిరి జిల్లాను, అత్యధికంగా 26 మండలాలతో నల్లగొండ జిల్లా ఏర్పాటుకానున్నాయి.
 
యాదాద్రిలోనే జనగాం
జనగాం ప్రాంతాన్ని యాదాద్రి జిల్లాలోనే కలిపేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తొలుత హన్మకొండ కేంద్రంగా ఏర్పడే జిల్లాలో జనగాంను కొనసాగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్‌పూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు వర్ధన్నపేటలోని రెండు మండలాలు, హుస్నాబాద్‌లోని రెండు మండలాలు కలిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో యాదాద్రి జిల్లాలో మార్పులేమీ చోటు చేసుకోలేదు. కొత్తగా తెరపైకి వచ్చిన పెద్దపల్లిలో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలుండేలా కసరత్తు చేశారు. మంథని నియోజకవర్గంలోని కొన్ని మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలుపనున్నారు. నిర్మల్ జిల్లాలో ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలతో పాటు ఖానాపుర్‌లోని ఒక మండలాన్ని కలుపనున్నారు.
 
ఆగమేఘాలపై ఆఖరి కసరత్తు
కొత్త జిల్లాల సంఖ్య ఖరారవడంతో వాటి నైసర్గిక స్వరూపం, సరిహద్దులపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ముసాయిదా నోటిఫికేషన్‌లో పొందుపరిచేందుకు వీలుగా కొత్త జిల్లాలకు సంబంధించిన అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. కొత్త జిల్లాల స్వరూపం, జనాభా, ఏయే మండలాలు అందులో చేరుతాయనే వివరాలను క్రోడీకరిస్తున్నారు. భౌగోళిక స్వరూపం సరిహద్దులను నిర్ధారించుకొని అందుకు అనుగుణంగా మ్యాప్‌లను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే కసరత్తు చేశారు.

తొలుత ఉదయాన్నే సచివాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన సీఎస్... ఆ వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగా హన్మకొండ, పెద్దపల్లి, శంషాబాద్, మల్కాజ్‌గిరి జిల్లాలు తెరపైకి రావడంతో.. అప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న జిల్లాల స్వరూపం మార్చాల్సి ఉంటుందని, దీనిపై తుది కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
 
కొత్తగా 14 రెవెన్యూ డివిజన్లు
కొత్త జిల్లాలతో పాటు కొత్తగా 14 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాలను చేర్చి ఈ డివిజన్లలను ఏర్పాటు చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు