దసరా రోజునే జిల్లాల సంబురం

5 Oct, 2016 02:00 IST|Sakshi
దసరా రోజునే జిల్లాల సంబురం

సిద్దిపేట, మెదక్ జిల్లాలు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
మిగతా జిల్లాలకు మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్
డివిజన్లు, మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఆసిఫాబాద్‌కు కొమురంభీం పేరు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో యాదాద్రి

 
ఆ నాలుగు జిల్లాల్లో ఏయే మండలాలు?
ఆసిఫాబాద్ జిల్లా (కొమురంభీం జిల్లా) (18): కాగజ్‌నగర్, సిర్పూర్, దహేగాం, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి(కొత్త), పెంచికల్‌పేట (కొత్త), ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యూ), లింగాపూర్, తాండూరు, కన్నేపల్లి, భీమిని, తిర్యాని.
 
సిరిసిల్ల (రాజన్న జిల్లా) (14): సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్(కొత్త), వేములవాడ, వేములవాడ రూరల్(కొత్త), చందుర్తి, రుద్రంగి(కొత్త), కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి, వీర్నపల్లి(కొత్త), పొత్తూరు(కొత్త).
 జనగాం జిల్లా(13): జనగాం, లింగాల ఘన్‌పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల(కొత్త), రఘునాథ్‌పల్లి, గుండాల, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూరు(కొత్త), జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల.
 గద్వాల జిల్లా(12): గద్వాల, ధరూర్, గట్టు, మల్దకల్, అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, నందిన్నె(కొత్త), రాజోలి(కొత్త), ఉండవల్లి(కొత్త).
 
సాక్షి, హైదరాబాద్: దసరా రోజునే కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, కొత్త మండలాల్లో పోలీస్ స్టేషన్లు, మండల రెవెన్యూ కార్యాలయాలు పని చేయాలని ఆదేశించారు. ప్రతీ రెవెన్యూ డివిజన్లో ఆర్డీవోతోపాటు డీఎస్పీ స్థాయి అధికారి ఉండాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు.
 
 మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతికుమారి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
 
 మంత్రులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తలా ఒక జిల్లాను ప్రారంభించాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని చెప్పారు. ఎవరు ఎక్కడ ఏ కార్యాలయాన్ని ప్రారంభించాలో జాబితా తయారు చేయాలని చెప్పారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పని చేయడానికి ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన పక్షంలో డీపీసీలు నిర్వహించి పదోన్నతులు కల్పించాలని సీఎం చెప్పారు.
 
 ఆసిఫాబాద్‌కే ‘కొమురం భీం’

 కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాకు ‘కొమురం భీం’ పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు. కొమురం భీం పుట్టిన జోడేగాట్ కొత్తగా ఏర్పడే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అందుకే ముసాయిదాలో ప్రతిపాదించిన మంచిర్యాల జిల్లాకు బదులు ఆసిఫాబాద్ జిల్లాకే కొమురం భీం పేరు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 17 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదాలో ప్రకటించామని, ఇవి కాకుండా జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉందని చెప్పారు.వీటికి తోడు కొత్త డివిజన్లు, మండలాలు ఏర్పాటవుతున్నందున అన్నిచోట్ల అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటు తదితర విషయాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిశీలించిన సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
    సిద్దిపేటలో పోలీస్ కమిషరేట్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లతోపాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
    యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీస్ కమిషనరేట్లో, జనగామ జిల్లాను వరంగల్ పోలీస్ కమిషనరేట్లలో భాగం చేయాలని సీఎం చెప్పారు.
  ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్‌ను, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరును, రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని సూచించారు.
   ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త రెవెన్యూ డివిజన్ ప్రారంభించాలని నిర్ణయించినందున.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా భైంసాలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు
   కొత్తగా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, మనోహరాబాద్, ములుగు నియోజకవర్గంలో కన్నాయిగూడెం, నిర్మల్ అర్బన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు
    మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్‌తోపాటు చేవెళ్ల మండలాన్ని కూడా రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలోనే చేర్చాలని ఆదేశించారు. ఆ నాలుగు మండలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి మార్చాలని చెప్పారు
♦  నాగిరెడ్డిపేట మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కొనసాగించాలని నిఘా వర్గాలు జరిపిన సర్వేలో తేలిందని సీఎం చెప్పారు. ఆ మండలాన్ని కామారెడ్డిలో కొనసాగించాలని, అవసరమైతే మెదక్‌కు సమీపంలో ఉన్న ఆ మండల పరిధిలోని గ్రామాలను మెదక్ జిల్లాలో కలపాలని సూచించారు.
 
 కల్వకుర్తి డివిజన్‌పై చర్చలు
 మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని వస్తున్న డిమాండ్‌పై సీఎం చర్చలు జరిపారు. ఆ జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవితో మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కొత్తగా ఏర్పడే కడ్తాల మండలం ప్రతిపాదిత రంగారెడ్డి(శంషాబాద్) జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసే అవకాశాలు లేవు. కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి, వెల్దండ మండలాలు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలో కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు ఎలా? అనే ప్రశ్న తలెత్తింది. కానీ ప్రజల నుంచి డిమాండ్ ఉన్నందున కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు