ముస్లిం రిజర్వేషన్ల పేరిట కొత్త నాటకం

6 Apr, 2016 05:19 IST|Sakshi
ముస్లిం రిజర్వేషన్ల పేరిట కొత్త నాటకం

♦ అధిష్టానం మొట్టికాయలు వేయడంతో సంతకాల సేకరణ
♦ కాంగ్రెస్ నాయకులపై మంత్రి కేటీఆర్ మండిపాటు
♦ 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం
♦ చట్టపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం
 
 సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాలుగా ముస్లింలను ఓటు బ్యాంకుగా, ఓటింగ్ యంత్రాలుగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీరిగ్గా ముస్లిం రిజర్వేషన్ల పేర కొత్త నాటకానికి తెరలేపిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముస్లింల జీవన ప్రమాణాల స్థాయిని పెంచడానికి ఏనాడూ కనీస ప్రయత్నం చేయని కాంగ్రెస్.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.

ఎలాంటి శాస్త్రీయ అంచనా లేకుండా 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి, చివరకు కోర్టు మొట్టికాయలతో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సంతకాల సేకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధిష్టానం పిలిచి తలంటితే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త డ్రామాకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. సంతకాల సేకరణ పేర ముస్లిం సోదరులను రెచ్చగొట్టే పనిలో కాంగ్రెస్ నాయకులు పడ్డారని విమర్శించారు. సంతకాల సేకరణ చేపట్టే ముందు, 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, 4 శాతమే ఇచ్చినందుకు నాటి కాంగ్రెస్ మంత్రులు క్షమాపణ సంతకాలు చేయాలని, ముస్లింలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 2004-2014 మధ్య నియమించిన జస్టిస్ రాజేం దర్ సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక దశాబ్దాల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను బయట పెట్టిందన్నారు. సచార్ కమిటీ సూచనలను కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఏ అంశం తీసుకుంటే ప్రజలకు దగ్గర కావొచ్చో కూడా తెలియడం లేదని, అందుకే సంతకాల సేకరణ చేపట్టిందని, కాంగ్రెస్‌ది మతిలేని వ్యవ హారమన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం గురించి ముస్లింలకు బాగా తెలుసు కాబట్టే పెద్దగా స్పందించడం లేదని మంత్రి వివరించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి తమకు ఉంది కాబట్టే సీఎం కేసీఆర్ సుధీర్ కమిటీని నియమించారని చెప్పారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదు కాబట్టి, ముస్లిం రిజర్వేషన్లను బీసీ కమిషన్ అంగీకరించాల్సి ఉంద ని, అదీ కాక ఒక రాష్ట్రంలో 50 శాతం మించి రిజర్వేషన్లు పెరగకూడదని రాజ్యాంగ నిబంధన ఉందని గుర్తుచేశారు. 50 శాతం పరిమితిని పెంచుకునేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం ప్రధానిని కలుస్తామని చెప్పారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్ణయం ఉందని, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వాళ్లు ఏం ప్రజెంట్ చేస్తారు? వాళ్ల చేతగాని తనాన్ని చెప్పుకుంటారా అని కేటీఆర్ నిలదీశారు.

మరిన్ని వార్తలు