ఆర్‌ఎఫ్‌సీని తలదన్నేలా తెలంగాణలో కొత్త ఫిల్మ్‌సిటీ

25 Jan, 2016 22:26 IST|Sakshi
ఆర్‌ఎఫ్‌సీని తలదన్నేలా తెలంగాణలో కొత్త ఫిల్మ్‌సిటీ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయమని రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ప్రపంచస్థాయి ఫిల్మ్‌సిటీ (రామోజీ ఫిల్మ్ సిటీ- ఆర్‌ఎఫ్‌సీ) ఉందని.. దీన్ని తలదన్నేలా మరో ఫిల్మ్‌సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందన్నారు. ప్రపంచ స్థాయిలో అత్యున్నత సాంకేతికతో ఏర్పాటుకానున్న ఈ ఫిల్మ్‌సిటీ నిర్మాణంలో సినీ పరిశ్రమ భాగం పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ సదస్సులో పాల్గొన్న జయేశ్ రంజన్.. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న అత్యున్నత విధానాలపై అధ్యయనం జరిపి లండన్‌లో అమలవుతున్న విధానమే అత్యున్నతమైనదని గుర్తించిందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైం సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లు వేల సంఖ్యలో ఉంటున్నాయని, వీటిని నిలిపేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. వెబ్‌సైట్లను బ్లాక్ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని తాము చేస్తున్న డిమాండ్‌కు మద్దతు తెలపాలని కోరారు.

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా క్లస్టర్ ఏర్పాటు కోసం రూ. 500 కోట్ల విలువజేసే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. ఇందులో మల్టిమీడియా సిగ్నేచర్ టవర్‌ను నిర్మిస్తామన్నారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్ల కొరతను ఈ ప్రాజెక్టుతో తీర్చుకోవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా సహకరిస్తోందని, ఇలాంటి తోడ్పాటు అరుదుగా లభిస్తుందని ఐఫా డెరైక్టర్ సబ్బాస్ జోసెఫ్ అభినందించారు. పేద, మధ్యతరగతి ప్రజలు మల్టిప్లెక్స్ థియేటర్ల టికెట్ల భారాన్ని మోయలేరని, అందువల్ల ఎక్కువ సంఖ్యలో థియేటర్లను ఏర్పాటు చేస్తేనే ప్రజలకు సినిమా చేరుతుందని బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్ర పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలోని అన్ని శాఖల్లో తీవ్రంగా ఉన్న నిపుణుల కొరతను అధిగమించేందుకు యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు పేర్కొన్నారు. బాలల చిత్రాలు, యానిమేషన్ చిత్రాలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని సినీ నిర్మాత అల్లు అరవింద్ పిలుపునిచ్చారు. సదస్సులో దిగ్గజ దర్శకుడు రమేశ్ సిప్పి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ సినీనటులు నాగార్జున, వివేక్ ఒబెరాయ్, ఆస్కార్ అవార్డు గ్రహిత రసూల్ పోకుట్టి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు