రాజ్‌భవన్‌ సిబ్బందికి నూతన గృహాలు

6 Mar, 2017 03:46 IST|Sakshi
రాజ్‌భవన్‌ సిబ్బందికి నూతన గృహాలు

సముదాయాన్ని ప్రారంభించిన గవర్నర్, ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ సిబ్బంది నూతన గృహాల సముదాయాన్ని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్, ముఖ్యమంత్రి గృహ సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌భవన్‌ సిబ్బంది గృహ సముదాయానికి గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను గవర్నర్‌ నరసింహన్‌ స్వయంగా పర్యవేక్షించి రికార్డుస్థాయిలో 13 నెలల్లోనే గృహ సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్, విశిష్ట వసతులతో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో తలపెట్టిన ఈ నిర్మాణం 2.70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 152 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఏ, బీ, సీ క్వార్టర్లలో నివాస సముదాయం, పాఠశాల భవనం, కమ్యూనిటీ హాలును నిర్మించారు. ఈ భవనాలకు పూర్తిగా సోలార్‌ విద్యుత్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గార్డెనింగ్‌కు హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు నీటిని సరఫరా చేయనుంది.

మరిన్ని వార్తలు