రామప్ప కీర్తికి ‘హెరిటేజ్‌’ కిరీటం!

17 Aug, 2017 03:48 IST|Sakshi
రామప్ప కీర్తికి ‘హెరిటేజ్‌’ కిరీటం!
వారసత్వ సంపద హోదాపై కొత్త ఆశలు 
- యునెస్కో కోరినట్టు ఆధారాలు పంపనున్న ప్రభుత్వం 
- సేకరణ బాధ్యతలు ప్రఖ్యాత నర్తకి చూడామణికి 
- మూడు రోజులు అధ్యయనం.. రామప్ప అద్భుతమంటూ కితాబు 
సెప్టెంబర్‌ రెండో వారంలో దరఖాస్తు  
నేడు హైదరాబాద్‌లో కీలక భేటీ 
 
సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఆలయమంటే ఆధ్యాత్మికతకు ఆలవాలం. అది భక్తిభావంతోపాటు దేశీయ సంస్కృతిని ప్రతిబింబించే దృశ్య కావ్యం కూడా అయితే? అప్పుడిక దాని ప్రత్యేకతే వేరు. అలా ఆధ్యాత్మికతకు, అద్భుత నృత్య రీతులతో కూడిన శిల్ప సంపదకు ఆటపట్టుగా అలరారుతున్న గొప్ప దేవాలయం రామప్ప. కళ్యాణి చాళుక్యులు, దేవగిరి యాదవ రాజులు, చోళులు, పాండ్యులు, కాకతీయులు 12–15 శతాబ్దాల మధ్య నిర్మించిన వందలాది ఆలయాల్లో మకుటాయమానం అనదగ్గ అద్భుత ప్రత్యేకతలు ఈ ఆలయం సొంతం!!’’
 
► ప్రఖ్యాత నర్తకి, నృత్య పరిశోధకురాలు ప్రొఫెసర్‌ చూడామణి నందగోపాల్‌ వెలిబుచ్చి న అభిప్రాయాలివి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందే అర్హతలు రామప్పకు పూర్తిగా ఉన్నాయని కూడా తేల్చారామె. యునెస్కో కన్సల్టెంట్‌ కూడా అయిన నందగోపాల్, రామప్ప ఆలయాన్ని మూడు రోజుల పాటు ఆసాంతం పరిశోధించి చెప్పిన ఈ మాటలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ నిర్మాణానికీ ఇప్పటిదాకా ఈ హోదా లేని లోటును రామప్ప తీర్చే అవకాశం కనిపిస్తోంది. యునెస్కో గుర్తింపు పొందేందుకు రామప్పకున్న అర్హతలను సవివరంగా పొందుపరుస్తూ నందగోపాల్‌ సమగ్రమైన దరఖాస్తు (డోసియర్‌)ను రూపొందించనున్నారు.

కేంద్రం దాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో యునెస్కోకు పంపనుంది. రామప్పపై అధ్యయనంలో తాను గుర్తించిన అంశాలను తాత్కాలిక నివేదిక రూపంలో నందగోపాల్‌ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేనున్నారు. ఇందుకోసం గురువారం ప్రభుత్వ సలహాదారు పాపారావు, పురావస్తుశాఖ సంచాలకులు విశాలాచ్చి, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు నిర్వాహకులతో హైదరాబాద్‌లో ఆమె భేటీ కానున్నారు.   
 
యునెస్కో సందేహాల నివృత్తి కోసం... 
చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణాలకు ప్రపంచ వారసత్వ హోదా కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో చివరి ప్రయత్నంగా రామప్ప ఆలయానికి హోదా కోసం ప్రభుత్వం 4 నెలల క్రితం దరఖాస్తు చేసింది. దాన్ని కేంద్రం యునెస్కోకు పంపగా నిర్మాణపరంగా రామప్ప ప్రత్యేకతలు, దానికి ప్రపంచ ప్రసిద్ధి పొందేందుకున్న అర్హతలకు సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో దరఖాస్తును దాదాపుగా తిరస్కరించింది. దాంతో, రామప్ప విశిష్టతలను తెలిపే ఆధారాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయ గోడలు, పై కప్పులపై నృత్య భంగిమలే ఎక్కువగా ఉండటంతో ఆ రంగ నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది.

యునెస్కో గుర్తింపు పొందిన కర్ణాటకలోని హంపి, బాదామీ పట్టదకల్‌ శివాలయం, తమిళనాడులోని మహాబలిపురం వంటి కట్టడాల ప్రత్యేకతలపై అధ్యయనం చేసిన నందగోపాల్‌ను ఇందుకు ఎంపిక చేసింది. నాలుగు రోజుల క్రితం ఆమె నృత్య, విద్య, కళా పరిశోధకురాలు సౌమ్య మంజునాథ్, పురావస్తు శాఖ విశ్రాంత ఉప సంచాలకుడు రంగాచార్యులుతో కలిసి రామప్పపై అధ్యయనం చేశారు. కుడ్యా లు, పై కప్పులపై చెక్కిన మురళీధర కృష్ణుడు, గోపికా వస్త్రాపహరణం, సాగర మథనం, అష్టదిక్పాలకులు, కోలాటాలు, వాయిద్యాలతో కూడిన శిల్పాలు, యువ తుల తాడాట వంటి వాటన్నింటినీ నిశితంగా పరిశీలించారు. 
 
► కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి బావమరిది జయాపసేనాని 1250లో రచించిన నృత్త రత్నావళిలోని వర్ణనలకు రామప్ప ఆలయ శిల్పాకృతులే ప్రేరణ అని తేల్చారు. 
► నటరాజ రామకృష్ణ రూపొందించిన పేరిణీ శివ తాండవానికి  ఆలయశిల్పాలే స్ఫూర్తి అన్న దానిని పరిగణనలోకి తీసుకున్నారు. 
► 7, 8వ శతాబ్దాలకు చెందిన మహాబలిపురం, 8, 9 శతాబ్దాలకు చెందిన బాదామీ పట్టడకల్‌ శివాలయం, 11 శతాబ్దానికి చెందిన తంజావూరు బృహదీశ్వరాలయం, 16వ శతాబ్దానికి చెందిన హంపి కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందాయి. వీటి మధ్య కాలానికి చెందిన రామప్ప ఆలయంలో వాటికి తీసిపోని ప్రత్యేకతలెన్నో ఉన్నాయని తేల్చారు. నివేదికలో వీటన్నింటినీ సవివరంగా పొందుపరచనున్నారు.  
మరిన్ని వార్తలు