అన్నింటికీ ‘మూల’కణం..!

13 Apr, 2016 04:40 IST|Sakshi
అన్నింటికీ ‘మూల’కణం..!

మూలకణ చికిత్సలో నవశకం.. కొత్త అవయవాలు సృష్టించే అవకాశం
అవయవాలు కోల్పోయిన వారికి వరం..  ఎలుకలపై పరిశోధనలు విజయవంతం
వచ్చే ఏడాది మానవులపై ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు
 
సాక్షి, హైదరాబాద్: బల్లి తోక తెగిపోతే ఏమవుతుంది.. తిరిగి కొంత కాలానికి పెరుగుతుంది. ఆటోటోమి అనే ఈ ప్రక్రియ సరీసృపాలు, కొన్ని జాతుల ఉభయచరాల్లో సర్వసాధారణం. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు వీటిల్లో ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఏదైనా ప్రమాదంలో మనుషులు అవయవాలు కోల్పోతే కృత్రిమ అవయవాలను అమర్చుకోవాల్సిందే. అయితే వారికి కూడా బల్లుల మాదిరిగానే కోల్పోయిన అవయవాలు తిరిగి వస్తే.. ఇది నిజంగా వారికి ఓ వరం లాంటిదే. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ మేరకు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయి. ఎముక, కొవ్వు కణాలను మూలకణాలుగా మార్చడం ద్వారా కొత్త అవయవాలు పెరిగేలా చేయొచ్చని వారు నిరూపించారు. త్వరలోనే మానవులపై ప్రయోగాలు చేసి అవయవాలు కోల్పోయిన వారికి శుభవార్త చెబుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్లవుతారు.

మూల కణాలంటే..?
పిండస్థ దశలో ఉండే మూల కణాల నుంచే శిశువు వివిధ శరీర భాగాలు ఏర్పడతాయి. పెద్ద పెరిగిన తర్వాత కూడా ఈ మూల కణాలు ఉంటాయి. అయితే ఒక్కో అవయవంలో దానికి సంబంధించినవే ఉంటాయి. ఆ అవయవంలోని కణాలు కానీ, కణజాలం కాదెబ్బ తింటే తిరిగి పెరిగేందుకు పెద్దల మూల కణాలు దోహదపడుతాయి. అంటే ఈ కణాలు కేవలం సంబంధిత అవయవ కణాలుగానే వృద్ధి చెందగలవు. అయితే ఈ పెద్దల మూల కణాలను కూడా పిండ కణాలుగా మార్చేయొచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ శాస్త్రవేత్తలు నిరూపించారు. మానవుని కొవ్వు కణాల నుంచి వేరు చేసిన మూలకణాలను పిండంలోని మూల కణాల మాదిరిగా మార్చి ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు.

దీంతో ఎలుకల్లో దెబ్బ తిన్న కణజాలం స్థానంలో కొత్తది ఏర్పడటం గుర్తించినట్లు పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ పిమాండా తెలిపారు. తెగిపోయిన బల్లుల తోకల స్థానంలో ఈప్రక్రియ ద్వారానే కొత్త తోకలు ఏర్పడతాయని ఆయన వివరించారు. వచ్చే ఏడాది చివరిలో మానవులపై చేపట్టే ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స అందజేయొచ్చని పేర్కొన్నారు. గుండె కణాలు, నాడీ కణాలు, వెన్నుముక వంటి కీలకమైనవి దెబ్బ తిన్నపుడు వాటిని ఈ ప్రక్రియ ద్వారా పునరుద్ధరించొచ్చని చెప్పారు.

మరిన్ని వార్తలు