ఢిల్లీలో ‘ప్రైవేటు’ చక్కర్లు

12 Jun, 2017 01:05 IST|Sakshi
ఢిల్లీలో ‘ప్రైవేటు’ చక్కర్లు
- ట్రావెల్స్‌ యాజమాన్యాల కొత్త ఎత్తులు 
- 2 ప్లస్‌ 1 బెర్తుల విధానానికి అనుమతించేలా పైరవీలు 
- అరుణాచల్‌ నుంచి బస్సుల రిజిస్ట్రేషన్‌ మార్పుకోసం యత్నం
- ఈలోగా చర్యలు లేకుండా  తెలుగు ప్రభుత్వాలపై ఒత్తిడి
రంగంలోకి రాజకీయ నేతలు
 
సాక్షి, హైదరాబాద్‌: తమ రాష్ట్రంలో రిజిస్టరై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రైవేటు బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను అరుణాచల్‌ప్రదేశ్‌ రద్దు చేయడంతో దిక్కుతోచని ట్రావెల్స్‌ నిర్వాహకులు ఢిల్లీ కేంద్రంగా పైరవీలకు దిగారు. ఆ బస్సులను తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతోపాటు 2 ప్లస్‌ 1 బెర్తుల విధానానికి కూడా (36 బెర్తులకు) ఇక్కడ అనుమతులు తెచ్చుకునే దిశగా చక్రం తిప్పుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 24 బెర్తులకు మాత్రమే అనుమతి ఉంది.

ఇటీవల కేంద్రప్రభుత్వం రవాణా చట్టానికి స్వల్ప సవరణలు చేసింది. దీని ప్రకారం ఈ బెర్తుల సంఖ్యలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో అది 2 ప్లస్‌ 1 బెర్తుల విధానంలాగే ఉండేలా ఆదేశాలు జారీ చేయించడానికి ప్రైవేటు ఆపరేటర్లు రింగ్‌గా ఏర్పడి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆదేశాలు రాగానే తెలుగు రాష్ట్రాలనే కేంద్రంగా చేసు కుని ఎప్పటిలాగే బస్సులు తిప్పుకోవచ్చనేది వారి ఎత్తుగడ. ఆ వెంటనే అరుణాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా రద్దు చేయించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనేది ఆలోచన. 
 
కిమ్మనని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు...
నిబంధనలు బేఖాతరు చేస్తున్న వెయ్యి బస్సులపై అరుణాచల్‌ప్రదేశ్‌ కన్నెర్ర చేస్తే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కిమ్మనటం లేదు. స్థానికంగా నిబంధనల ఊసే లేకుండా యథేచ్ఛగా ఆ ప్రైవేటు బస్సులు తిరుగుతున్నా చిన్న చర్య కూడా తీసుకోవటం లేదు. దీన్ని ఆసరా చేసుకున్న ఆపరేటర్లు... ఢిల్లీలో లాబీయింగ్‌ ఫలించేవరకు తమ బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చక్రం తిప్పినట్టు సమాచారం. అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాలూకు ఆదేశాల కాపీ అందిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ రెండు రాష్ట్రాల రవాణాశాఖలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్‌ రవాణాశాఖ కమిషనర్‌ జారీ చేసిన ఆదేశాల ప్రతి అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆదేశాలు ‘అధికారికంగా’అందాల్సి ఉందంటున్నాయి.
 
ఎన్‌ఓసీతో తంటా...
అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌లను ఉపసంహరిం చుకుని తెలుగురాష్ట్రాల్లో నమోదు చేసుకోవాలంటే ఆ రాష్ట్రప్రభుత్వం ఎన్‌ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అరుణాచల్‌ప్రదేశ్‌ రవాణా శాఖ ఎన్‌ఓసీ ఇవ్వటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ద్వారా కథ నడిపిం చాలని వాటి నిర్వాహకులు యత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన బడా నేతలు కొందరు ఆ ‘భారం’భుజాలకెత్తుకున్నట్టు తెలిసింది. 
 
అరుణాచల్‌ కన్నెర్ర....
తమ రాష్ట్రంలో రిజిస్టర్‌ చేయించుకున్న బస్సులు నిర్ధారిత సమయంలో కచ్చితంగా తమ భూ భాగంలోకి రావాలన్న నిబంధనను ఉల్లంఘించటం తో అరుణాచల్‌ప్రదేశ్‌ వెయ్యి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కన్నెర్ర చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ట్రావెల్స్‌ నిర్వాహకులు తమ బస్సులకు టూరిస్ట్‌ పర్మిట్‌ తీసుకుని స్టేజీ క్యారియర్లుగా తిప్పు తున్నారు. చట్టరీత్యా ఇది నేరం. కానీ ఇక్కడి ప్రభుత్వాలు కిమ్మనటం లేదు. తెలంగాణ ఆర్టీసీ వీటి మూలంగా సాలీనా రూ.800 కోట్లు నష్టపోతోంది. దీన్ని నివారించేందుకు రవాణాశాఖ–ఆర్టీసీకి సంయు క్తంగా ఓ నోడల్‌ అధికారిని స్వయంగా సీఎం కేసీఆరే నియమించినా లాభం లేకుండా పోయింది. అరుణా చల్‌ప్రదేశ్‌ ఉదంతం నేపథ్యంలో ఆర్టీసీ ముందుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా చర్యలు కనిపించటం లేదు. 
 
ఆ బస్సులు రిజిస్టర్‌ చేస్తే ఆందోళన.. 
అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వేటుపడ్డ ప్రైవేటు బస్సులకు ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేస్తే ఆందోళనకు దిగు తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అటువంటి యోచనను విరమించుకోవాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అదనపు ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు ఒక ప్రకటన చేశారు. 
 
ఏమిటీ 2 ప్లస్‌ 1?
అరుణాచల్‌ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో స్లీపర్‌ బస్సుల్లో 2 ప్లస్‌ 1 విధానంలో 36 బెర్తులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే బస్సులో ఆరు కంపార్ట్‌మెంట్లు... ఒక్కో దానిలో నాలుగు బెర్తులు ఏర్పాటు చేస్తారు. అంటే 24 బెర్తులు అవుతాయి. దీంతోపాటు మరోవైపు 12 సీట్లు ఏర్పాటు చేస్తారు. వాటిని కూడా స్లీపర్‌ సీట్లుగా పరిగణిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక్కో బస్సుకు పన్నురూపంలో ఏటా కేవలం రూ.18 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో వారు అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 
మరిన్ని వార్తలు