అందరూ షాకయ్యారు

6 Jan, 2018 09:24 IST|Sakshi

ఇంత పెద్ద సిటీలోనూ బైక్‌ నడిపించే అమ్మాయిల శాతం చాలా తక్కువే. ప్రముఖ కళాశాలల విద్యార్థినులను అడిగినప్పుడు చాలామంది తమకు బైక్‌ నడిపించడం రాదన్నారు. కారణమేంటని అడిగితే.. తల్లిదండ్రులు వద్దనడం, టీజింగ్, సేఫ్టీ తదితర చెప్పారు. అమ్మాయిలతో బైకథాన్‌ నిర్వహించాలనుకున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మమతా రఘువీర్, బైకర్నీ జయభారతిలకు ఇది ఆశ్చర్యం కలిగించింది. అప్పుడే అమ్మాయిలకు బైక్‌ నేర్పించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీరు.      – సాక్షి, సిటీబ్యూరో  

సెల్ఫ్‌ డిఫెన్స్, మెడికల్‌ ఎమర్జెన్సీ, ట్రాఫిక్‌ రూల్స్, భద్రత, బాధ్యతాయుత డ్రైవింగ్‌.. ఇలా అన్నీ కలిపి ఒక కోర్సు తయారు చేసింది జయభారతి. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్, రవాణాశాఖ, హీరో మోటర్స్‌తో కలిసి బేగంపేట్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ట్రైనింగ్‌ పార్క్‌లో ఈ సెషన్‌ నిర్వహించారు. అమ్మాయిలు బైక్‌ నేర్చుకోవడానికి అడ్డంకిగా చూపుతున్న అన్నింటికీ ఈ శిక్షణతో సమాధానమిచ్చారు. ఇది మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్‌లో 30 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న మహిళలు ‘సాక్షి’తో తమ అనుభవాలు పంచుకున్నారు.

ఇదీ కోర్సు..
మొదటి బ్యాచ్‌లో గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థినులు శిక్షణ తీసుకున్నారు. ప్రతి శనివారం ఉదయం 7–9 వరకు 8 వారాలు శిక్షణ ఉంటుంది. మొదటి రెండు తరగతుల్లో లర్నింగ్‌ లైసెన్స్‌ సెషన్స్‌ నిర్వహించారు. శిక్షణలో డ్రైవింగ్‌ రూల్స్, లైసెన్స్‌ విధివిధానాలు, ఆర్టీఏ విభాగాలతో సెషన్స్‌ ఉంటాయి. శిక్షణకు బైక్‌లను హీరో మోటార్స్‌ సమకూరుస్తోంది. బైకర్నీ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు రూ.500 నామమాత్ర ఫీజు తీసుకుంటున్నారు. మొదటి బ్యాచ్‌కు వచ్చిన స్పందనతో మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణనివ్వనున్నారు. వివరాలకు ‘తరుణి’ ఫేస్‌బుక్‌ పేజీని సంప్రదించండి.  www.facebook.com/Tharuni.org  

ఇదో సాధికారత..  
అమ్మాయిలు బైక్‌పై వెళ్తే భద్రత ఉండదని పేరెంట్స్‌ భయపడుతుంటారు. కానీ బైక్‌ ఉంటే ఎక్కువ సేఫ్‌. సమయం మన చేతిలో ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లగలం. ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. మహిళ బైక్‌ నడుపుతుందంటే సాధికారత సాధించినట్లే. మహిళలకు సైకిల్స్‌ ఇవ్వడం, బైక్‌ రైడింగ్‌ నేర్పించడం ద్వారా వారిని
సాధికారత సాధించేలా చేయాలన్నదే మా సంస్థ లక్ష్యం.  
– మమత, ‘తరుణి’ నిర్వాహకురాలు  


చీరకట్టు అడ్డుకాదు..
నా జీవితం ఇంటికి పరిమితమైంది. నేనేమీ చేయలేనని నాన్నకు అభిప్రాయం ఏర్పడింది. ఎలాగైనా బైక్‌ రైడింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నాన్నను ఇక్కడికి తీసుకొచ్చి నేను బైక్‌ నడిపి చూపించాను. ఇది నాలో కొత్త ఉత్సాహన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. స్కూటీ లాంటివి నేర్చుకోవడానికి చీరకట్టు అడ్డుకాదు. బైక్‌కు చుడిదార్‌ వేసుకుంటే సరిపోతుంది.  
– స్వప్న, గృహిణి

అవకాశమే ఆయుధం..
అమ్మాయిలకు బైక్‌ నేర్చుకునే అవకాశం లేకపోవడంతోనే వారు వెనకబడిపోయారు. అవకాశం కల్పించి నేర్పిస్తే బాగా నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. ఇందుకు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలే ఉదాహరణ.  
– జయభారతి, లేడీ బైకర్‌  

అందరూ షాకయ్యారు..
మా ఇంట్లో పల్సర్, ఎఫ్‌జడ్‌ ఉన్నాయి. అయితే బైక్‌లు బరువుగా ఉంటాయని అన్నయ్యలు నన్ను నడపొద్దు అనేవారు. ఇక్కడ శిక్షణలో చేరాక ఓ రోజు బైక్‌ రైడ్‌ చేసి చూపించాను. అంతే అందరూ షాకయ్యారు. అమ్మ అయితే ఫుల్‌ హ్యాపీ. నాకు అవెంజర్‌ కొనివ్వమని ఇంట్లో డిమాండ్‌ చేస్తున్నాను. బైక్‌
నేర్చుకోవడం కష్టమేం కాదు. బ్యాలెన్సింగ్‌ రావాలంతే.  
– శ్రుతి, డిగ్రీ ద్వితీయ సంవత్సరం  

అబ్బాయిలకే పెద్ద బైకులా?  
అమ్మాయిలకు చిన్న బైక్‌లు, అబ్బాయిలకు పెద్ద బైక్‌లు అనడం కరెక్ట్‌ కాదు. ధైర్యసాహసాలు అంటే మగవారి సొత్తుగా చిత్రీకరించారు. అమ్మాయిలందరూ బైక్‌ నడపాలి. అప్పుడే అన్ని బైక్‌లు అందరికీ అనే ఆలోచన వస్తుంది.
– సత్యవేణి

ఏ వయసులోనైనా ఓకే..  
మనకు నచ్చిన పని చేయడానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. నేను 51 ఏళ్ల వయసులో బైక్‌ నేర్చుకొని నడపిస్తున్నాను. ఏ కారణాలతోనూ మన ప్యాషన్‌ను పక్కన పెట్టొద్దు. సరైన శిక్షణ తీసుకొని, భద్రతా ప్రమాణాలు పాటించాలి.  
– అనిత, స్వచ్ఛంద సేవకురాలు 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా