కొత్తగా 26 ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులు 

4 Jan, 2018 03:40 IST|Sakshi

   పేదలకు సేవలందించేలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్మాణం 

     బాలింతల మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు 

     జనవరి 15న మూడు బ్లడ్‌ బ్యాంకుల ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: బాలింతల ఆరోగ్య పరిరక్షణ లో వైద్య, ఆరోగ్య శాఖ మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులను ఏర్పాటు చేయనుంది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన రక్తాన్ని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 26 బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది. అం దులో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్‌ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఎం ఆధ్వర్యంలో బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. భూపాలపల్లి, అచ్చంపేట, మల్కాజ్‌గిరిలోని బ్లడ్‌ బ్యాంకులను జనవరి 15న ప్రారంభించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ 26 కొత్త బ్లడ్‌ బ్యాంకుల్లో 6 నెలల్లోపు పూర్తి స్థాయి సేవలు ప్రారంభం కానున్నాయి. పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలోనే వీటి నిర్మాణం జరుగుతోంది. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం జరిగే సందర్భాల్లో ఒక్కోసారి 2 నుంచి 10 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. సరిపడా రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్నిసార్లు బాలింత మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. 

‘ప్రైవేటు’కు అడ్డుకట్ట..! 
రాష్ట్రంలో ఏటా 4 లక్షల యూనిట్ల రక్తం అవసరముంటోంది. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులు లేకపోవడంతో ప్రైవే టు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులు ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ.3 వేల నుంచి 5 వేలు వసూ లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్లడ్‌ బ్యాంకులతో ఈ దోపిడీకి అడ్డకట్ట పడనుంది.   వీటికి అనుబంధంగా 21 రక్త నిధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రక్తాన్ని పరీక్షలు నిర్వహిం చి రక్త నిధి కేంద్రాల్లో భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరిచేలా వీటిని రూపొందిస్తున్నారు.  

ఉత్తమ ప్రమాణాలు.. 
కొత్త బ్లడ్‌ బ్యాంకుల నిర్మాణంలో నాణ్యత పరంగా ఎక్కడా రాజీ పడకూడదని అధికారులు నిర్ణయించారు. అధునాతన సాంకేతిక ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నారు. 200 యూనిట్ల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఒక్కోబ్లడ్‌ బ్యాంకు కోసం గరిష్టంగా రూ.65 లక్షలు ఖర్చు చేస్తున్నా రు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రంలో 136 బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ప్రస్తుతం 28 ఉన్నాయి.  ఇప్పటికే ఉన్న వా టిని ఉత్తమ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని బ్లడ్‌ బ్యాంకులను దశలవారీగా నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌) ధ్రువీకరణ పొందేలా తీర్చి దిద్దుతోంది.  

కొత్త బ్లడ్‌ బ్యాంకులు.. 
జాతీయ ఆరోగ్య మిషన్‌: మలక్‌పేట, నాంపల్లి, నారాయణపేట్, అచ్చంపేట, మల్కాజ్‌గిరి, షాద్‌నగర్, బాన్సువాడ, భైంసా, పెద్దపల్లి, పరకాల, భూపాలపల్లి, ఏటూరునాగారం, మంథని. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌: నాగర్‌కర్నూల్, ఘట్‌కేసర్, కొండాపూర్, మెదక్, బోధన్, ఉట్నూరు, ఆసిఫాబాద్, గోదావరిఖని, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, భువనగిరి, కింగ్‌కోఠి (హైదరాబాద్‌).  

మరిన్ని వార్తలు