మేడమ్‌ మీ పేరు మీద యూకే పౌండ్లు పార్శిల్‌..

7 Jun, 2017 10:46 IST|Sakshi
మేడమ్‌ మీ పేరు మీద యూకే పౌండ్లు పార్శిల్‌..

–రాచకొండ యువతికి రూ.14 లక్షల కుచ్చుటోపీ
–ప్రధాన నిందితుడు పరారీలో
–డబ్బులు డిపాజిట్‌ అయిన బ్యాంక్‌ ఖాతాదారుడి అరెస్టు


హైదరాబాద్‌ సిటీ : ‘యూకేలో డాక్టర్‌ను. నెలకు లక్షల్లో జీతమంటూ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌తో రాచకొండకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో పరిచయం. వాట్సాప్‌ నంబర్‌ ద్వారా చాటింగ్‌తో మరింత దగ్గరై నమ్మకం పెరిగాక యువతి పెళ్లికి ఓకే అంది. వీసా చార్జీలకు ఇండియా కరెన్సీని ఏజెంట్‌కు ఇవ్వాలంటూ మొదలెట్టిన మోసంతో యూకే పౌండ్ల పార్శిల్‌తో రూ.14 లక్షల వరకు కుచ్చుటోపీ పెట్టాడు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ కథనం ప్రకారం...గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతి పలు మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో రిజిస్టర్‌ చేసుకుంది. ఫిబ్రవరి 7న డాక్టర్‌ సుమంత్‌ భరత్‌ పేరుతో ఆమె భారత మ్యాట్రిమోనీ ఖాతాకు ఓ సందేశం వచ్చింది.

తాను యూకేలో డాక్టర్‌ కొలువు చేస్తానని నెలకు లక్షల్లో జీతం ఉంటుందని, పెళ్లికి చేసుకుంటానని నమ్మించాడు. ఏప్రిల్‌ తొలివారంలో తన కుటుంబ సభ్యులతో ఇండియాకు వస్తున్నామని చెప్పాడు. వీసా చార్జీలకు ఇండియా కరెన్సీని ఏజెంట్‌కు పంపించాలని, ఆ తర్వాత ఒక మిలియన్‌ పౌండ్లను పంపిస్తానని నమ్మించాడు. ఇది నమ్మిన యువతి కొంత డబ్బును ఏజెంట్‌ ఖాతాలో జమచేశారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌ కస్టమ్స్‌ అధికారినంటూ ...‘మేడం మీ పేరు మీద ఒక పార్సిల్‌ వచ్చింది. అందులో యూకే పౌండ్లు ఉన్నాయి. అది మీ దగ్గరికి రావాలంటే యాంటీ టెర్రరిజం సర్టిఫికెట్, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ చార్జీలు చెల్లించాలం’టూ యూకే పౌండ్లు ఉన్న పార్శిల్‌ ఫొటోలను వాట్సాప్‌లో షేర్‌ చేశాడు. నిజమేనని నమ్మిన బాధితురాలు ఏమాత్రం ఆలోచించకుండా రూ.14 లక్షలు వారు చూపిన బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేసింది.

అయితే రోజులు గడుస్తున్నా యూకే పౌండ్ల పార్శిల్‌ రాకపోవడంతో మోసపోయానని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ ప్రారంభించి ఢిల్లీ కేంద్రంగా మోసం జరిగినట్టు గుర్తించారు. ‘సైబర్‌ ఛీటర్‌ ఇండియాలో ఓ మధ్యవర్తి ద్వారా ఒక నైజీరియన్‌ ఈ మోసం చేసినట్లు గుర్తించారు. బాధితురాలు 11 బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసిన రూ.14 లక్షల్లో పది శాతం కమిషన్‌ను ఆయా బ్యాంక్‌ ఖాతాదారులకు నిందితుడు ఇచ్చాడు. ఈ కేసుల్లో ఈ బ్యాంక్‌ ఖాతాదారుల్లో ఒకడైన ఢిల్లీకి చెందిన రషీద్‌ ఖాన్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు నైజీరియన్‌ను, అతడికి సహకరించిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు