త్వరలో నైట్‌షెల్టర్ల ఏర్పాటు

10 Nov, 2013 04:03 IST|Sakshi

 సాక్షి, సిటీబ్యూరో : ఎముకలు కొరికే చలి రాత్రుల్లో నిరాశ్రయుల దుస్థితిని వెల్లడిస్తూ.. అలాంటి వారికోసం నైట్‌షెల్టర్ల అవసరాన్ని తెలియజేస్తూ శుక్రవారం ‘చలిపంజా’ శీర్షికన ‘సాక్షి’ వెలువరించిన కథనానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందించారు. ఆశ్రయం లేక.. రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్న ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నారో గుర్తించి వివరాలు అందజేయాల్సిందిగా కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు.

నైట్‌షెల్టర్లు అవసరమైన ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు అందుబాటులో ఉన్నట్లయితే  ఏర్పాట్లకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో భవనాలను గుర్తించడమో.. నిర్మించేందుకు అవకాశాలున్నాయేమో పరిశీలించాలన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, అదనపు కమిషనర్ (యూసీడీ) కెన్నడీతో కలిసి శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. రాత్రి వేళలో రోగి సహాయకులు నిద్రించేందుకు అవసరమైన షెల్టర్ నిర్మాణం గురించి ఆస్పత్రి సీఈఓ ఆర్పీ సింగ్‌తో ఆయన చర్చించారు.

షెల్టర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అవసరమైన అనుమతులు ఇవ్వడం లేదని సింగ్.. కమిషనర్ దృష్టికి తెచ్చారు. తమ తరపున అవసరమైన సహాయం అందిస్తామని సోమేశ్‌కుమార్ హామీనిచ్చారు. అనంతరం ఆయన రోగులు, వారి సహాయకులతో సాధకబాధకాలపై చర్చించారు. అదే విధంగా మిగతా ఆస్పత్రుల వద్ద రోగి సహాయకులు, ఇతరత్రా నిరాశ్రయులు తలదాచుకునేందుకు, రాత్రి వేళల్లో సౌకర్యవంతంగా నిద్రించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కెన్నడీని సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
 
 కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు
 
 నగరంలో నైట్‌షెల్టర్లు లేని వైనంపై వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు హరిగౌడ్ తదితరులు శుక్రవారం కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను కలిసి.. తలదాచుకునే చోటు లేని అభాగ్యుల కోసం వెంటనే వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్, వీలైనంత త్వరితంగా.. వీలైనన్ని ప్రాంతాల్లో నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
 
 దుప్పట్లు పంపిణీ చేసిన వైఎస్సార్‌సీపీ ఐటీవింగ్


 రాత్రివేళల్లో చలికి వణికిపోతున్న అభాగ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీవిభాగం ఆపన్నహస్తం అందించింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘చలిపంజా’ కథనానికి చలించి బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఉన్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డితో పాటు హర్షవర్ధన్, సురేంద్ర, రాకేష్, మహేష్, శంకర్, ప్రసాద్, చంద్ర, ఆదిత్య, అరవింద్‌లు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు