నిమ్స్ వైద్యుల వినూత్న నిరసన

5 Aug, 2015 01:52 IST|Sakshi
నిమ్స్ వైద్యుల వినూత్న నిరసన

- గాంధీజీ చిత్రపటానికి గులాబీల సమర్పణ
- యాజమాన్యానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకోలు
పంజగుట్ట:
నిమ్స్‌కు నష్టం వాటిల్లే చర్యలు తీసుకోకుండా, ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడేలా యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని నిమ్స్ ఆసుపత్రి ఫ్యాకల్టీ అసోసియేషన్ మంగళవారం ఆసుపత్రిలోని గాంధీ చిత్రపటానికి గులాబీలు సమర్పించి వేడుకుంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ చేపట్టిన ఆందోళన మంగళవారం 2వ రోజుకు చేరింది. వైద్యులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి, గాంధీ చిత్రపటం వద్ద గులాబీలు ఉంచి తమ సమస్యలు పరిష్కరించేలా నిమ్స్ యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం డెరైక్టర్ నరేంద్రనాథ్‌కు గులాబీలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.

పదోన్నతులు పాతవిధానంలోనే కొనసాగించాలని కోరారు.  వైద్యులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిరసన వ్యక్తంచేసి అనంతరం ఓపీ రోగులకు సేవలందించారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీభూషన్‌రాజు మాట్లాడుతూ... ఆసుపత్రిలోని ఫ్యాకల్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పదోన్నతులపై ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో మాదిరిగానే ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.  తమ డిమాండ్ల సాధనకు నిమ్స్ యాజమాన్యానికి ఇచ్చిన 72 గంటల సమయం మంగళవారంతో పూర్తవుతుందని, బుధవారం సాయంత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు