పేదలకు అండదండ

10 Dec, 2014 00:48 IST|Sakshi
పేదలకు అండదండ

⇒ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నిర్ణయం
⇒4 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం
⇒సర్కారుకు భారీగా ఆదాయం
⇒సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలకు కార్యాచరణ
⇒మెట్రో అలైన్‌మెంట్‌పై మరోమారు సమావేశం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న నిరుపేదలకు శుభవార్త. 80 నుంచి 125 చదరపు గజాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సమక్షంలో మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నగరంలోని సుమారు మూడు లక్షల నిరుపేద కుటుంబాలకు సాంత్వన కలగనుంది.

125 గజాలు దాటిన నిర్మాణాలను సైతం నిర్ణీత రుసుంతో క్రమబద్ధీకరించాలన్న అఖిల పక్షం నిర్ణయంతో మరో లక్ష మందికి మేలు కలగనుంది. గతంలో ఉచితంగా 80 గజాల ఇళ్లను క్రమబద్ధీకరించగా... ఈ మారు దాన్ని 125 గజాలకు పెంచడం విశేషం. గతంలోని నిబంధనలు అడ్డుగా పెట్టుకుని ఒకే కుటుంబ సభ్యులు, కొంతమంది పెద్దలు వివిధ పేర్లతో 80 గజాల స్థలాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి.
 
ఊపందుకోనున్న మెట్రో పనులు
సుల్తాన్‌బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్ మార్పునకు విపక్షాలు అంగీకరించడంతో ఆయా ప్రాంతాల్లో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. సుల్తాన్‌బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రో మార్గం మళ్లనుంది. అసెంబ్లీ వెనక వైపు నుంచి మెట్రో మార్గాన్ని మళ్లించేందుకు అన్ని పక్షాలూ అంగీకారం తెలిపాయి. ఇక జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2) రూట్లో అలైన్‌మెంట్ మార్పు చేయాల్సిందేనంటూ ఎంఐఎం పట్టుబట్టినట్లు తెలిసింది. లేనిపక్షంలో పాత నగరంలో వెయ్యికి పైగా నిర్మాణాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఈ విషయమై ఈనెల 16న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో మరోమారు అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని సీఎం సూచించారు. దీంతో ఈ మార్గంలో అలైన్‌మెంట్ మార్పుపై వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
 
కాసుల పంట
నగరంలోని యూఎల్‌సీ భూములను ఆక్రమించుకొని 1400 ఎకరాల్లో నిర్మించుకున్న 33,127 ఇళ్లు, భవనాలు, 200 ఎకరాల్లోని 1927 వాణిజ్య సంస్థలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో సర్కారుకు కాసుల పంట పండనుంది. నగరంలో రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించిన యూఎల్‌సీ భూమి 114.22 ఎకరాలు, ప్రభుత్వ భూమి 25 ఎకరాలను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కబంధ హస్తాల్లో ఉన్న ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికార యంత్రాగాన్ని ఆదేశించినట్లు తెలిసింది
 
సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు
హుస్సేన్‌సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భ వన నిర్మాణానికి అన్ని పార్టీల నుంచి మద్దతు లభించడంతో ప్రభుత్వం త్వరలోనే ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఇతర అంశాలపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాల నిర్మాణానికి మాత్రం ఎవరి నుంచీ వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అంతేకాకుండా నగర కీర్తిని ఇనుమడింపజేసేందుకు వాటిని నిర్మించాలని అభిప్రాయపడ్డారు.  దీంతో పాటు పాటిగడ్డ, నర్సింగ్ కాలేజీ, దిల్‌కుష్ గెస్ట్ హౌస్, రాఘవ టవర్స్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల్లో భారీ టవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
వినాయక సాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన
హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనం చేపట్టాలని బీజేపీ సహా పలు పార్టీలు అఖిలపక్ష సమావేశంలో పట్టుబట్టిన నేపథ్యంలో ఇందిరాపార్క్ దగ్గర వినాయకసాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంపైనా ఈనెల 16న జరగనున్న సమావేశంలో స్పష్టత రానుంది.

>
మరిన్ని వార్తలు