నయీమ్‌ను చూడలేదు: దినేశ్‌రెడ్డి

14 Aug, 2016 02:21 IST|Sakshi
నయీమ్‌ను చూడలేదు: దినేశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బతికున్నంతకాలం అతన్ని చూడలేదని, ఎన్‌కౌంటర్ తర్వాతే మీడియాలో చూశానని రిటైర్డ్ డీజీపీ, బీజేపీ నేత వి.దినేశ్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో శని వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నయీమ్ అధ్యాయం ముగిసిందన్నారు. నయూమ్‌ను ఎన్‌కౌంటర్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు తెలిపారు. అవినీతి, అరాచకాలకు, గ్యాంగ్‌స్టర్లకు ప్రధాని మోదీ ప్రభుత్వం, బీజేపీ చాలా దూరమన్నారు. నయీమ్ ఘటనపై ఏర్పాటైన సిట్ పటిష్టంగా దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని దినేశ్‌రెడ్డి కోరారు. సిట్ పనితీరు సరిగ్గా లేకుంటే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు.

తాను డీజీపీగా పనిచేసినంతకాలం నయీమ్‌ను పట్టుకునే అవకాశం రాలేదన్నారు. మాజీ మావోయిస్టులను ఇన్‌ఫార్మర్‌లుగా వాడుకోవడం సహజమని, అయితే నయీమ్‌లాగా గ్యాంగ్‌స్టర్‌లను ప్రోత్సహించడం సరికాదన్నారు. మాజీ డీజీపీకి నయీమ్‌తో సంబంధాలున్నాయని మీడియాలో వార్తలు రావడం సరికాదన్నారు.

తొందరపడి, పనిగట్టుకుని ఒక మీడియా తనపై దుష్ర్పచారం చేస్తోందని దినేశ్‌రెడ్డి ఆరోపించారు. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య జరిగినప్పుడు తాను పక్కన ఉన్నట్టు ప్రచారం చేయడం కూడా సరికాదన్నారు. అప్పుడు తాను 400 గజాల దూరంలో ఉన్నానని దినేశ్‌రెడ్డి వెల్లడించారు. డీజీపీ స్థాయి వంటి వారికి నయీమ్ లాంటి వారితో ప్రత్యక్ష సంబంధాలు ఉండవన్నారు. అమాయకులను వేధిస్తే కూడా ఊరుకునేది లేదని దినేశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు