యంత్రమా నిన్ను నడిపేదెవరూ?

22 Jul, 2015 18:52 IST|Sakshi
యంత్రమా నిన్ను నడిపేదెవరూ?

హైదరాబాద్: ఒకరేమో లేక బాధపడితే.. మరొకరికి అజీర్తి చేసిందన్నట్లుంది జీహెచ్ఎంసీ ముషీరాబాద్ డివిజన్ అధికారుల తీరు. సిటీలో చాలా డివిజన్లకు సరైన యంత్రాలు లేక అభివృద్ధి పనుల నిర్మాణం, నిర్వహణలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు కేటాయించిన కొత్త రోలర్ ను ఉపయోగించుకోలేక.. కనీసం ఆ యంత్రానికి రక్షణ కల్పింలేకపోతున్నారు.

సిటీలోని అత్యంత చెత్త డివిజన్లలో ఒకటైన ముషీరాబాద్ కు ప్రభుత్వం ఇటీవలే రూ. 3.4 లక్షల విలువ చేసే మినీ రోలర్ ను అందించింది. భోలక్ పూర్, కవాడిగూడ, ముషీరాబాద్, రాంనగర్ డివిజన్లలో రోడ్డు తాత్కాలిక మరమ్మతులు, రోడ్లపై మట్టి పోసి అణగదొక్కడం వంటి పనులు చేయాల్సిన ఈ యంత్రం.. ప్రస్తుతం కార్యాలయం ముందు నిరుపయోగంగా పడిఉంది. ఆరాతీయగా, ఈ యంత్రాన్ని నడపగలిగే సామర్ధ్యం అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగులకు లేదని, కొత్తగా రోలర్ ఆపరేటర్ ను నియమించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తెలిసింది.

సరే, ఆపరేటర్ వచ్చినా, రాకున్నా కొత్త వాహనానికి కనీస రక్షణ ఏర్పాట్లు కూడా చేయకుండా అలా వదిలేశారు అధికారులు. దీంతో రోలర్ వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ తుప్పుపట్టే స్థితికి చేరుకుంది. ఇకనైనా రోలర్ కోసం చిన్న షెడ్డు లాంటిది ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా ఆపరేటర్ ను నియమించి రోడ్లపై గుంతలు పూడ్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు