ఇక్కడ ఉరి తీసేందుకు వీలుందా?

21 Dec, 2016 09:07 IST|Sakshi
ఇక్కడ ఉరి తీసేందుకు వీలుందా?
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేల్చిన ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది గానీ.. ఆ తీర్పును అమలు చేయడానికి తెలంగాణలో ఎక్కడైనా వీలు కుదురుతుందా? ప్రస్తుతానికి అయితే అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే.. ఇక్కడున్న రెండు సెంట్రల్ జైళ్లలో ఎక్కడా అసలు ఉరికంబం అన్నదే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలులో మాత్రమే ఉరికంబం ఉంది. తెలంగాణలోని చంచల్‌గూడ, వరంగల్ సెంట్రల్ జైళ్లకు ఉరికంబాలు కావాలని ఇక్కడి జైళ్ల శాఖ ప్రతిపాదన పంపింది గానీ, దానికి ఇంకా అనుమతి రాలేదు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ చీఫ్ వీకే సింగ్ చెప్పారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సెంట్రల్ జైళ్లలో కనీసం ఒకటైనా ఉరి కంబం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం లేదు. ఇది కొత్త రాష్ట్రం కావడంతో.. ఇంకా అసలు దాని అవసరం ఉంటుందని కూడా జైళ్ల అధికారులు భావించి ఉండకపోవచ్చన్నది సీనియర్ల అభిప్రాయం. 
 
రాజమండ్రి సంగతేంటి..
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సెంట్రల్ జైలు రికార్డుల ప్రకారం దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 42 మందిని అక్కడ ఉరితీశారు. 1930లోనే ఇక్కడ ఉరికంబం నిర్మాణం జరిగినా, 1949 నుంచే ఉరితీతలు మొదలయ్యాయి. చిట్టచివరిసారిగా 1976 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్ప అనే ఖైదీని ఉరితీశారు. ఆ తర్వాత ఇంతవరకు అక్కడ ఉరిశిక్షలు అమలుకాలేదు. 1980లో ఉరికంబాన్ని జైల్లోనే బహిరంగ ప్రదేశానికి తరల్చారు గానీ, ఆ తర్వాత ఎవరినీ ఉరి తీయలేదు. 
మరిన్ని వార్తలు