చినుకు రాలినా.. ఏదీ జలసిరి

9 Aug, 2016 00:10 IST|Sakshi
చినుకు రాలినా.. ఏదీ జలసిరి

► సిటీలో పెరగని భూగర్భ జలమట్టాలు
► ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు
► 337 మి.మీటర్లకు గాను 316 మి.మీటర్లు మాత్రమే కురిసిన వాన
► ఇంకుడు గుంతలు లేక ఇబ్బందులు
► గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో తగ్గిన నీటిమట్టాలు


సాక్షి, సిటీబ్యూరో:  ఈ సీజన్‌లో గ్రేటర్‌లో వర్షాలు కురిసినప్పటికీ భూగర్భ జలసిరి మాత్రం పెరగలేదు. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో  తరచూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినప్పటికీ పలు మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు పెరగ లేదు. మహానగరంలో సాధారణ వర్షపాతాన్ని పరిశీలిస్తే..జూన్‌ తొలివారం నుంచి ఆగస్టు తొలివారం వరకు సాధారణంగా 337 మి.మీ వర్షపాతం నమోదయ్యేది. కానీ ఈసారి 316 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అలాగే సాధారణ వర్షపాతంలోనూ 0.6 శాతం తరుగుదల నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 29 రోజులపాటు వర్షం కురిసినప్పటికీ వాననీరు నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు అందుబాటులో లేకపోవడంతో భూగర్భ జలసిరి పెరగలేదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.l


పలు మండలాల్లో పెరగని జలసిరి...
గతేడాదితో పోలిస్తే హయత్‌నగర్‌ మండలంలో 5.88 మీటర్లు, హిమాయత్‌నగర్‌లో 4.28 మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 1.15 మీటర్లు, మహేశ్వరంలో 3.80 మీటర్లు, కుత్భుల్లాపూర్‌లో 0.85 మీటర్లు, సరూర్‌నగర్‌లో 0.75 మీటర్లు, శామీర్‌పేట్‌లో 2.80 మీటర్లు, ఉప్పల్‌లో 1.42 మీటర్లు, మల్కాజ్‌గిరిలో 1.20 మీటర్లు, రాజేంద్రనగర్‌లో 2.65 మీటర్లు, శంషాబాద్‌లో 0.90 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గడం గమనార్హం.


ఇంకుడు గుంతలు లేకనే ఈ దుస్థితి..
గ్రేటర్‌ పరిధిలో సుమారు 25 లక్షల భవంతులు, 22 లక్షల బోరుబావులుండగా..వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతల సంఖ్య లక్షలోపుగానే ఉండడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని భూగర్భజలశాఖ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు