ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి

11 Feb, 2017 08:03 IST|Sakshi
ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి
  • ఉప ప్రణాళిక స్థానంలో అమలుకు ఎస్సీ, ఎస్టీ కమిటీల తీర్మానం
  • చట్ట సవరణలకు సిఫారసు... పథకాల్లో మార్పులు
  • రెండ్రోజుల్లో ప్రభుత్వానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక
  • సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు ఇకపై ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్‌డీఎఫ్‌), ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్‌డీఎఫ్‌)గా మారనున్నాయి. ఈ మేరకు చట్ట సవరణలు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. బడ్జెట్‌ లో పద్దుల మార్పు నేపథ్యంలో సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సవరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన శాఖ మంత్రి చందూలాల్‌ అధ్యక్షతన ఎస్టీ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు... తాజాగా శుక్రవారం మూడోసారి సమావేశమయ్యాయి.

    ఈ క్రమంలో చట్ట సవరణలపై చర్చ నిర్వహించిన కమిటీ సభ్యులు, అధికారులు పది అంశాలపై తీర్మానాలు చేశారు. వీటిని ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణ యించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎస్సీఎస్‌ డీఎఫ్, ఎస్టీఎస్‌డీఎఫ్‌లలో తలపెట్టనున్న పథకాలSపైనా సుదీర్ఘ చర్చ నిర్వహించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎస్టీఎస్‌డీఎఫ్‌కు సంబంధించి పథకాల్లో మార్పులు, కొత్త పథకాలపై సూచనల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టే కార్యక్రమాలపై స్పష్టత రాలేదు.

    చట్ట సవరణలపై తీర్మానాలివి: సబ్‌ప్లాన్‌ అమలులో ప్రస్తుతమున్న పదేళ్ల కాలపరిమితిని తొలగించి.. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని తీర్మానించారు. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను సభ్యులుగా చేర్చాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కౌన్సిల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ/ఎస్టీ అభివృద్ధి శాఖల సీనియర్‌ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్‌గా నియమించాలని తీర్మానించారు. సవరణలపై ముసాయిదా ప్రకటించిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిటీలు చట్ట సవరణలపై చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేస్తుంది.

    గిరిజనాభివృద్ధి పథకాలపై ప్రధాన సిఫార్సులు...
    ► గిరిజనుల అక్షరాస్యతను పెంచేందుకు సాక్షరభారత్‌ పథకానికి అదనపు నిధులు
    ► బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకంలో సీట్ల సంఖ్య 2 వేలకు పెంచాలి
    ► పదివేల మంది గిరిజన డ్రాప్‌అవుట్లకు ఒపెన్‌ వర్సిటీ ద్వారా పట్టభద్రులుగా తీర్చిదిద్దాలి
    ► హాస్టళ్లలో మెస్‌ చార్జీలను ప్రస్తుతం 25 శాతం పెంచడంతో పాటు ఏటా 5శాతం పెంచాలి.
    ► కొత్తగా మరో 50 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు
    ► ‘ఓన్‌ యువర్‌ కార్‌’ కింద ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మరో 500మందికి అవకాశం కల్పించాలి
    ► గిరిజన భూఅభివృద్ధి పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 వేల మంది గిరిజన రైతులకు గాను 30వేల ఎకరాల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేయాలి
    ► గుడుంబా బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి
    ► మిషన్‌ భగీరథ కింద ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం.. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు మంజూరు.
    ► ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలి
    ► వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద గిరిజనులకు వందశాతం రాయితీతో యంత్రాలు
    ► కల్యాణ లక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1.01 లక్షలకు పెంచి, పెళ్లి రోజు నాటికే అందించాలి
    ► 42 శాఖల పరిధిలో ఉన్న ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

మరిన్ని వార్తలు