ఇలాగైతే హామీలే మిగలవు

9 May, 2016 07:51 IST|Sakshi
ఇలాగైతే హామీలే మిగలవు

‘ఉచిత’ పథకాలపై తమిళనాడు గవర్నర్ రోశయ్య
 హైదరాబాద్: జనాకర్షక ఉచిత పథకాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేరువయ్యేందుకు పోటీపడుతున్నాయని, ఇలాగైతే భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకు హామీలే మిగలవని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆదివారం హస్తినాపురంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. రోశయ్య మాట్లాడుతూ... రాజకీయాలంటే ప్రజలకు దిశ, దశ నిర్దేశించేవిగా ఉండాలని, కానీ ప్రస్తుతం ఉచిత హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వైశ్యులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఐకమత్యంగా నిరంతర సామాజిక స్పృహతో ముందుకు సాగాలన్నారు.
 
 వేదికలపై తీర్మానాలు చేసి ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఎవరూ చైతన్యవంతులు కారన్నారు. సమాజంలో ఆర్యవైశ్యులపై మంచి అభిప్రాయం, గుర్తింపు ఉన్నాయని, దానిని నిలుపుకోవాలన్నారు. ఆర్యవైశ్యుల్లో వెనుకబడిన వారి పిల్లల చదువుకు ఉపకార వేతనాలు ఇచ్చేలా సంఘం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ... రాష్ట్ర జనాభాలో 8 శాతం ఉన్న వైశ్యులు ఆ ప్రాతిపదికన రాజకీయంగా ఎదగాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్‌కుమార్‌సంఘీ, మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు