ఆ హోంగార్డుల సంగతేంటి?

15 Apr, 2018 00:44 IST|Sakshi

2 నెలలుగా 400 మంది వెయిటింగ్‌లోనే

జీతాలు సైతం చెల్లించని పోలీస్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: పలు విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేసి మాతృ విభాగంలో రిపోర్టు చేసిన 400మంది హోంగార్డులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. అంబర్‌పేట్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన హోంగార్డులు ఎఫ్‌సీఐ, దూరదర్శన్‌తో పాటు పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో డిప్యుటేషన్‌పై మూడేళ్లు పనిచేసి మళ్లీ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేశారు. వీరు రిపోర్టు చేసి 2నెలలు గడిచినా.. వాళ్లకి మళ్లీ పోస్టింగ్స్‌ కల్పించకపోవడం తో ఆ కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి.

2 నెలల నుంచి జీతభత్యాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటివరకు వీరంతా రూ.12 వేల జీతభత్యాల మీద పలు విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేశారు. ఇటీవలే జీతభత్యాల పెంపు రూ.20 వేలకు వెళ్లడంతో డిప్యుటేషన్‌పై హోం గార్డులను వినియోగించుకుంటున్న విభాగాలు ఈస్థాయిలో జీతాలు చెల్లించలేమని వీరందరినీ హెడ్‌క్వార్టర్స్‌కు పంపాయి. ప్రస్తుతం పోలీస్‌ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులకే రూ.20 వేలు వర్తిస్తుందని, వారి వరకే బడ్జెట్‌లో ప్రభు త్వం కేటాయింపులు చేసిందని చెప్పడంతో వెయింటింగ్‌లో ఉన్న హోంగార్డులు మరింత ఆందోళనలో పడ్డారు.

దీనిపై తాము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల దృష్ట్యా ఆదేశాలకు ఆలస్యమైందని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారని బాధిత హోంగార్డులు తెలిపారు. ఇప్పటికైనా వెయింటింగ్‌లో ఉన్న తమకు పోస్టింగ్స్‌ కల్పించి జీతభత్యాల పెంపు వర్తింపుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేలా పోలీస్‌ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు