భద్రత లేదు.. భవిష్యత్తూ లేదు!

31 Aug, 2017 02:11 IST|Sakshi
భద్రత లేదు.. భవిష్యత్తూ లేదు!
- ప్రభుత్వ కార్యాలయాల్లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల దయనీయ స్థితి
ఏళ్లకేళ్లుగా అరకొర వేతనాలే.. ఇందులోనూ కమీషన్ల పేరిట కోతలు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.. ప్రభుత్వోద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. ఏళ్లకేళ్లుగా ఉద్యోగంలో కొనసాగుతున్నా.. అరకొర వేతనాలే దిక్కవుతున్నాయి. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి కనీస సదుపాయాలూ కరువయ్యాయి. వచ్చే జీతంలోనూ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు కమీషన్ల పేరిట కోతలు పెడుతున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోతున్నారు.
 
కార్మిక చట్టాలకు తూట్లు
కేంద్రం ఇటీవల కార్మిక చట్టాల్లో సంస్కరణలను తీసుకొచ్చింది. ప్రతి ఉద్యోగికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ను తప్పనిసరి చేసింది. ప్రైవేటు సంస్థలు కూడా ఈ సౌకర్యాలు కల్పించాలి. ఈ లెక్కన ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ కచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా.. రాష్ట్రంలో అది అమలుకావడం లేదు. రాష్ట్రంలో దాదాపు 22,500 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉండగా.. ఇందులో 1,750 మందికే పీఎఫ్‌ సౌకర్యం కల్పించారు. 550 మందికే ఈఎస్‌ఐ సదుపాయం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటి కోసం విజ్ఞప్తి చేసినా స్పందన లేదని మహబూబ్‌నగర్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
 
ఉన్న ఉద్యోగానికే భద్రత లేదు..
ఏడేళ్ల కింద ఇన్సూరెన్స్‌ కాల్‌ సెంటర్‌లో ఉద్యోగంలో చేరా. క్రమబద్ధీకరణ సంగతేమోగానీ ఉన్న ఉద్యోగానికే భద్రత లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలూ కూడా ఉండడం లేదు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఉపాధి కూలీల బీమా పథకాల ఫైళ్లు క్లియర్‌ చేయడం నా విధి. కానీ నాకు మాత్రం ఇన్సూరెన్స్‌ లేదు
– బి.నర్సింహులు, కంప్యూటర్‌ ఆపరేటర్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌
 
ఏజెన్సీలు ఎందుకంటే..?
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి సుదీర్ఘ ప్రక్రియ ఉండడంతో ఆయా పోస్టుల్లో తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమిస్తున్నారు. దాదాపు 17 ఏళ్లుగా ఇది అమలవుతోంది. తొలుత ఈ తాత్కాలిక ఉద్యోగులను ప్రభుత్వ శాఖలే నేరుగా నియమించుకోగా... కొంతకాలంగా ఈ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించారు. సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఏదైనా తప్పిదానికి పాల్పడితే ఏజెన్సీ నిర్వాహకులను బాధ్యులుగా చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలు ముందుజాగ్రత్తగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విద్యార్హత సర్టిఫికెట్లను తీసుకుని తమవద్దే పెట్టుకుంటున్నాయి. ఇక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు బాధ్యతను కూడా ఏజెన్సీలకే అప్పగించడంతో.. ఆయా ప్రభుత్వ శాఖలపై భారం కూడా ఉండదు. కానీ ఇలా ఉద్యోగుల బాధ్యతంతా ఏజెన్సీలపైనే పెట్టడంతో వాటి నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
 
వేతనాల్లో కోతలు.. చెల్లింపుల్లో జాప్యం..
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతినెలా 5లోపు వేతనాలు అందుతాయి. ఆయా శాఖలు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలను సైతం ఆలోపే ఏజెన్సీలకు చెల్లిస్తున్నాయి. ఏజెన్సీలు మాత్రం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి 12 నుంచి 24వ తేదీ మధ్య వేతనాలు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు కమీషన్‌ పేరిట వేతనంలో 2% నుంచి 5% వరకు కోత పెడుతున్నాయి. రూ.10 వేలలోపు వేతనమున్న వారికి 5%, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి నాలుగు, మూడు శాతం కోత పెడుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కనీస ప్రయోజనాలూ కరువే
ఏజెన్సీల నిర్వాకంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి పథకాలేవీ అందడం లేదు. ఈఎస్‌ఐ, ఆరోగ్య బీమాలతో ఉచిత వైద్యసేవలు అందుతాయి. ఇక పీఎఫ్‌తో ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. ఈ సౌకర్యాలను కల్పించాలని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం శూన్యం.
 
ఉత్తర్వులు అమలు కావడం లేదు
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడం లేదు. కంప్యూటర్‌ ఆపరేటర్‌కు రూ.18,500 వేతనం ఇవ్వాలని ఆదేశాలున్నాయి. కానీ రూ.15 వేలే ఇస్తున్నారు. ఇది అన్యాయం. 
– ఉబేద్, కంప్యూటర్‌ ఆపరేటర్, డీఆర్‌డీఏ ఆదిలాబాద్‌
 
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 22,500
వారిలో పీఎఫ్‌ ఖాతాలున్న ఉద్యోగుల సంఖ్య 1,750
ఈఎస్‌ఐ ఖాతాలు ఉన్న వారి సంఖ్య 550
మరిన్ని వార్తలు