రూ.1,600 కోట్లు నీటిపాలు!

30 Mar, 2016 01:55 IST|Sakshi
రూ.1,600 కోట్లు నీటిపాలు!

పట్టిసీమపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ 180 టీఎంసీల కృష్ణా డెల్టాను 4 టీఎంసీలతో కాపాడారట
♦ బాబు చెప్పడం.. మేం చెవిలో పూలు పెట్టుకుని వినడం..
♦ 190 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉండబట్టే పోల‘వరం’ అయ్యింది..
♦ పట్టిసీమకు స్టోరేజీ కెపాసిటీ ఏది?
♦ పోలవరం కుడికాల్వ 70 శాతం పూర్తి చేసింది వైఎస్ కాదా?
♦ అది ఉండబట్టే ఆ కాసిన్ని నీళ్లయినా సరఫరా..
♦ నిబంధనలకు విరుద్ధమైన పట్టిసీమ వల్లే బాబు నోరెత్తడం లేదు..
♦ మహారాష్ర్టతో తెలంగాణ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నా గప్‌చుప్..
♦ పైగా ఓటుకు కోట్లు కేసు వల్ల కేసీఆర్ అంటే బాబుకు భయం
♦ బాబు ఔట్‌డేటెడ్ అని ఆయన ప్రసంగమే చెబుతోంది..
 
 సాక్షి, హైదరాబాద్ : ‘పట్టిసీమ ద్వారా నీళ్ళిచ్చి కృష్ణాడెల్టాను కాపాడానని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. 180 టీఎంసీలు  అవసరం ఉండే కృష్ణా డెల్టాను పట్టిసీమ ద్వారా 4 టీఎంసీల నీళ్ళిచ్చి ఎలా కాపాడతారు?  నాకు అర్థం కావడం లేదు. ఇది చంద్రబాబు చెబుతా ఉన్నారు... చెవుల్లో పూలు పెట్టుకుని మేం వింటా ఉన్నాం. నిజంగా ఇంతకన్నా దారుణమేదీ ఉండదు’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాసనసభలో పట్టిసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రకటన చేశారు.

ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేసిన ఘనత తనదేనని, పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాను కాపాడామని సీఎం చెప్పారు. సీఎం ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలను సభ దృష్టికి తెచ్చారు. ‘పట్టిసీమ కోసం రూ. 1,600 కోట్లు ఖర్చు పెట్టారు. అవే రూ. 1,600 కోట్లు పోలవరం ప్రాజెక్టుపై పెట్టి ఉంటే ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. వాటిని గాలేరు-నగరిపై పెడితే ప్రాజెక్టు పూర్తయిపోయి ఉండేది. వాటిని హంద్రీ నీవాపై పెట్టి ఉంటే ఆ ప్రాజెక్టుకు ఒక రూపు వచ్చేది. పట్టిసీమ పేరుతో చంద్రబాబు 1,600 కోట్ల రూపాయలు నీళ్లపాలు చేశారు’ అని జగన్ విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

 పోలవరం కుడికాల్వ వైఎస్ పుణ్యమే
 ‘‘చంద్రబాబు ఈ రోజు పట్టిసీమ గురించి పదేపదే చెబుతున్నాడు. అసలా నీళ్లు కిందకు వెళ్తున్నాయంటే దానికి కారణం పోలవరం కుడికాల్వ. పోలవరం కుడికాల్వ పనులు  70 శాతం చేసిందెవరు అంటే... దివంగత నేత రాజశేఖర రెడ్డి అనేది సుస్పష్టం. ఆ రోజున ఆ మహానేత కుడికాల్వపై దృష్టి పెట్టడం వల్లే ఈ రోజు చంద్రబాబు ఆ నీళ్లను లిఫ్ట్ చేశానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు. పోలవరం ప్రాజెక్టుకు  జూలై, నవంబర్ వరకూ నీళ్ళు ఎక్కువగా వస్తాయి. కృష్ణాలో కూడా సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇదే మాదిరిగా నీళ్ళు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల నీటిని నిల్వచేస్తేనే మనం ఉపయోగించుకోగలుగుతామని దశాబ్దాల క్రితమే ప్రణాళికలు రూపొందించారు. పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. 2015-16లో 2 వేల టీఎంసీల గోదావరి నీళ్ళు సముద్రం పాలైనట్టు రికార్డులే చెబుతున్నాయి. అసలు పట్టిసీమకు స్టోరేజీ కెపాసిటీ ఎక్కడుంది? నిల్వ చేసే సదుపాయమే లేనపుడు పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి? పోలవరంలో 190 టీఎంసీల స్టోరేజీ సామర్థ్యం ఉంది. అందుకే పోలవరం వరమైంది. స్టోరేజీ కెపాసిటీని దృష్టిలో ఉంచుకునే పోలవరాన్ని ప్రతిపాదించారు.

 7ఈ, 7ఎఫ్ క్లాజులతో ఇక్కట్లే..
 చంద్రబాబు పట్టిసీమ కట్టడం వల్ల మరో ప్రమాదం పొంచి ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల  గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లోని క్లాజ్ నంబర్ 7ఈ, 7ఎఫ్ ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు దీన్ని వివాదం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రకు రావాల్సిన నీళ్ళను పాలమూరు నుంచి రంగారెడ్డి వరకూ లిఫ్ట్ పెట్టి టెండర్లు పిలిస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకోవడం లేదు? పట్టిసీమ ప్రాజెక్టు కట్టడంతో క్లాజ్ 7ఈ, 7ఎఫ్ వల్ల ఇబ్బందులున్నాయి కాబట్టే చంద్రబాబు అడగలేకపోతున్నారు.

 కేసీఆర్ అంటే బాబుకు భయం
 గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ సీఎం  కేసీఆర్ మహారాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రితో మంతనాలు నడుపుతున్నారు. మరి చంద్రబాబును వాళ్ళు ఎందుకు పిలవడం లేదని అడుగుతున్నా. కారణమేమిటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు నాయుడుకు లేదు. ఓటుకు కోట్లు కేసును బయటకు తీస్తాడేమోనని భయపడుతున్నాడు’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 అజ్ఞానితో మాట్లాడలేం
 
‘తెలియని వ్యక్తికైతే చెప్పవచ్చు. తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడొచ్చు. కానీ అన్నీ తెలుసు అనే అజ్ఞానితో మాత్రం మాట్లాడటం ఎవరికీ చేత కాదు. చంద్రబాబు నాయుడుగారి పరిస్థితి ఇదే’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ ప్రసంగిస్తుండగా సీఎం పలుమార్లు జోక్యం చేసుకున్నారు. విపక్ష సభ్యులకు సాగునీటి ప్రాజెక్టులపై సబ్జెక్ట్ లేదని, వాళ్ళకు ఎన్నిసార్లయినా క్లాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పదేపదే అన్నారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత పై విధంగా వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నంగా సీఎం చంద్రబాబు ‘జగన్‌మోహన్‌రెడ్డి గారు మీకు ఇంకా ఎంతో భవిష్యత్ ఉంది...’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్ష నేత స్పందిస్తూ, ‘చంద్రబాబు నాయుడు దాదాపు గంటన్నర అనర్గళంగా మాట్లాడిన మాటల్లో నాకు ఒక విషయమైతే అర్థమైంది... తాను ఔట్‌డేటెడ్ అయిపోయానని తన గురించి ఆయన చెప్పకనే బాగా చెప్పుకున్నారు’ అని వ్యంగ్యోక్తి విసిరారు.

మరిన్ని వార్తలు