చుట్టేస్తే.చిక్కులుండవు

12 Jul, 2016 23:55 IST|Sakshi
చుట్టేస్తే.చిక్కులుండవు

సిటీలో ‘ రోడ్డు బారికేడ్ల’తో సమస్యలు
ట్రాఫిక్ నియంత్రణ కోసం పలుచోట్ల ‘రహదారుల’ మూసివేత
నాన్-పీక్ అవర్స్‌లోనూ  అదే పరిస్థితితో ఇబ్బందులు
సిబ్బందికి సమస్యగా మారిన బారికేడ్ల ఏర్పాటు, తొలగింపు
సూరత్ తరహా ‘ఫోల్డబుల్ బారికేడ్లు’ వాడితే సత్ఫలితాలు

 

సిటీబ్యూరో:  సిటీలో ట్రాఫిక్ జామ్స్ నిరోధించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక ప్రాంతాల్లో ‘జంక్షన్ క్లోజింగ్’ ఫార్ములా అమలు చేస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లలోనూ సమయంతో నిమిత్తం లేకుండా దీన్నే పాటిస్తున్నారు. ఆయా రూట్లలో వెళ్ళే వాహనచోదకులకు ఇబ్బందులు కలిగించే ఈ విధానానికి కారణం బారికేడ్లు. వీటిని నిత్యం ఏర్పాటు చేయడం, తొలగించడం సిబ్బందికి ఇబ్బంది కావడంతో రద్దీ ఉండని వేళల్లోనే ‘క్లోజింగ్’ అమలవుతోంది. గుజరాత్‌లోని సూరత్ పోలీసులు వినియోగిస్తున్న ఫోల్డబుల్ బారికేడ్లు ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారంతో పాటు వాహనచోదకులకు సమయం, ఇంధనం కలిసివస్తాయి.
 
జంక్షన్లలో ఈ ఫార్ములా సక్సెస్...
నగరంలో ‘మూసివేత’ ఫార్ములాను ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రధాన జంక్షన్ల నుంచి ప్రారంభించారు. సిటీలోని పలు చౌరస్తాలు సమయంతో నిమిత్తం లేకుండా నిత్యం రద్దీగా ఉంటాయి. వివిధ దిక్కుల నుంచి వచ్చిపోయే వాహనాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ‘రెడ్-గ్రీన్’ మధ్య గరిష్టంగా మూడు నిమిషాల సమయం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ చౌరస్తాలకు అన్ని వైపుల ఉన్న రోడ్లలో వాహనాలు బారులుతీరుతున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు జంక్షన్లను మూసివేయడంతో పాటు ‘ఫ్రీ-లెఫ్ట్’ ఇచ్చి... కొద్దిదూరం తర్వాత ‘యూ టర్న్’ ఇవ్వడం ప్రారంభించారు. అనేక చౌరస్తాలో ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ఇదే విధానాన్ని విస్తరించిన ట్రాఫిక్ అధికారులు కొన్ని అంతర్గత రోడ్లలోనూ అమలు చేశారు.
 
‘అవర్స్’ తేడా లేకుండా అలానే...
పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో అంతర్గత రహదారుల్లోనూ ట్రాఫిక్ జామ్స్ నిరోధానికి ఈ చర్యలు తీసుకోవడం వరకు బాగానే ఉంది. అయితే జంక్షన్లు మూసేయడానికి ట్రాఫిక్ అధికారులు శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీటి ఫలితంగా నాన్-పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీలేని వేళల్లోనూ ఇదే పంథాలో వెళ్లాల్సి వస్తోంది. ఆయా ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనచోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. రద్దీ లేని వేళల్లోనూ ‘యూ టర్న్’ వరకు వెళ్లి తిరిగి రావాల్సి ఉండటంతో విలువైన ఇంధనం, సమయం వృధా అవుతున్నాయి. ఆయా బారికేడ్లను పదేపదే ఏర్పాటు చేయడం, తీయడం ట్రాఫిక్ సిబ్బందికి తలకు మించిన భారం కావడంతో అలానే వదిలేయాల్సి వస్తోంది.
 
‘సూరత్’ విధానంలో ఫలితాలు...గుజరాత్‌లోని సూరత్ నగర ట్రాఫిక్ పోలీసులు సాధారణ బారికేడ్ల స్థానంలో ఫోల్డబుల్ బారికేడ్లు వినియోగిస్తున్నారు. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లోనూ రద్దీ ఒకేలా ఉండదు. దీనికి తగ్గుట్టు అక్కడ మార్పుచేర్పులు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా ప్రాంతాల్లో ఫోల్డబుల్ బారికేడ్లు ఏర్పాటు చేసిన సూరత్ అధికారులు అవసరమైనప్పుడు వాటిని చుట్టేస్తున్నారు. వీటి తరలింపు సైతం సాధారణ బారికేడ్ల కంటే ఎంతో తేలికని అక్కడి అధికారులు చెప్తున్నారు. నగరంలోనూ ప్రధాన రహదారుల మినహా అంతర్గత ప్రాంతాల్లోని జంక్షన్లలో ఈ బారికేడ్లు ఉయుక్తంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో శాశ్వత బారికేడ్లు కాకుండా వీటిని ఏర్పాటు చేస్తూ రద్దీ వేళల్లో ఓపెన్ చేసినా... నాన్-పీక్ అవర్స్‌లో మళ్లీ చుట్టేసి పక్కన పెట్టే ఆస్కారం ఉంటుంది.
 

మరిన్ని వార్తలు