హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పలేదు

4 Aug, 2016 02:01 IST|Sakshi

14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ స్పష్టీకరణ
బీజేపీ, టీడీపీ ప్రకటనల్లో  పస లేదని తేలిపోయినట్లే

 
 
న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ద్వారా రాజ్యాంగం అడ్డుపడుతోందని అధికార బీజేపీ, టీడీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. హోదా వ్యవహారంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ విజ్ఞప్తి మేరకు 14వ ఆర్థిక సంఘం సభ్యుడైన అభిజిత్‌సేన్ ఈ-మెయిల్ ద్వారా బదులిచ్చారు. సదరు ఈ-మెయిల్‌ను జైరాం రమేశ్ బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ-మెయిల్‌లో అభిజిత్‌సేన్ ఏం చెప్పారంటే... ‘‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని, ప్రత్యేక కేటగిరీ హోదా విధానాన్ని రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదు. పన్నుల వాటా, గ్రాంట్ల పంపిణీ గణనకు సంబంధించి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపే తీరును నిలిపివేయాలని మాత్రమే నిర్ణయించింది. అయితే, ప్రణాళిక గ్రాంట్లు, నాన్ స్టాట్యుటరీ గ్రాంట్లు, ప్రణాళికేతర గ్రాంట్ల విషయంలో వ్యత్యాసం చూపించే స్వేచ్ఛ కేంద్రానికి ఉంది’’ అని స్పష్టం చేశారు.

‘హోదా’ సంజీవని కాదన్న చంద్రబాబు
తాజాగా అభిజిత్ సేన్ పంపిన మెయిల్ ఇప్పటివరకు బీజేపీ, టీడీపీ చేసిన ప్రచారంలో వాస్తవం లేదన్న సంగతిని తేటతె ల్లం చేసింది. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ, టీడీపీలు తదనంతరం మాట మారుస్తూ వచ్చాయి. విభజన చట్టంలో లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని మభ్యపెట్టాయి. రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రత్యేక హోదాతోనే అన్నీ సాధ్యమవుతాయా? అదేమైనా సంజీవనా? అని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు  వ్యాఖ్యానించారు. ఆ తరువాత ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరగడంతో  హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం అడ్డుపడుతోందని ప్రచారం చేశారు. చివరకు ప్రత్యేక హోదాను మించి కేంద్రం ప్యాకేజీ రూపంలో సాయం చేస్తుందంటూ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి పలుమార్లు ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేందుకు అడ్డుపడుతున్నాయని పేర్కొన్నారు.  
 
 

మరిన్ని వార్తలు