వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు

2 Apr, 2017 02:21 IST|Sakshi
వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు

జగన్‌పై మరోసారి ఎల్లో మీడియా వీరంగం
- మూడు చానెళ్లకు జగన్‌ లాయర్ల లీగల్‌ నోటీసులు
- ఏపీ విపక్ష నేత లక్ష్యంగా టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, ఈటీవీ విష కథనాలు
- ఈడీ ట్వీట్లకు సొంత కథను జోడించి మరీ ప్రసారం... సాయంత్రం ఈడీ చేసిన ప్రకటనను పట్టించుకోని వైనం
- ఇదంతా దురుద్దేశపూర్వకంగానే చేశారన్న జగన్‌ న్యాయవాదులు


సాక్షి ప్రత్యేక ప్రతినిధి

ఎల్లో మీడియా మళ్లీ విషం గక్కింది. అదిగో తోక అంటే.. ఇదిగో మేక అన్న చందాన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శనివారం ఇచ్చిన రెండు ట్వీట్లను పట్టుకుని ఎల్లో చానెళ్లు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీ రసవత్తరమైన కథను అల్లి పారేశాయి. అసలు ఈడీ ఏం చెప్పిందో.. ఎవరెవరినుద్దేశించి చెప్పిందో కూడా పట్టించుకోకుండా తమకు అలవాటైన తప్పుడు కథనాల్ని నిస్సంకోచంగా ప్రసారం చేసేశాయి.

ఒకపక్క ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు చంద్రబాబునాయుడు ఇరుకున పడటం, ఓటుకు కోట్లు కేసులో సాక్షాత్తూ చంద్రబాబుకే సుప్రీంకోర్టు నోటీసులివ్వటం... వీధి రౌడీల్ని మరిపిం చిన ఏపీ మంత్రుల గూండాగిరీని జనం అసహ్యించుకోవటం... ఏపీలో పెరుగుతున్న విచ్చలవిడి అవినీతిపై జాతీయ మీడియాలోనూ వార్తలొస్తుండటంతో... వీటన్నిటి నుంచి జనం దృష్టిని మళ్లించటానికి ఎల్లో చానెళ్లు శనివారం ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేశాయి.

అసలు ఏం జరిగిందంటే...: మనీ లాండరింగ్‌ ఆరోపణలెదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం చగన్‌ భుజబల్, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌మిషన్‌ స్కాం ఆరోపణలెదుర్కొంటున్న యాదవ్‌ సింగ్, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, ఇతర కేసుల్లో ఆరోపణలొచ్చిన ఏజీఎస్‌ ఇన్ఫోటెక్, రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఇలా పలు సంస్థలు, వ్యక్తులకు చెందిన షెల్‌ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్లు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ట్వీట్‌ చేసింది. వివిధ అంశాలకు సంబంధించి తాము సోదాలు జరిపిన సంస్థలు దేశ వ్యాప్తంగా 300 వరకూ ఉంటాయని కూడా మరో ట్వీట్‌లో తెలియజేసింది. నిజానికి ఇందులో రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అనే సంస్థ యారో గోల్డ్‌ జ్యుయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధిపతి రితేష్‌ జైన్‌ది. ఈ సంస్థ ద్వారా వందల కోట్ల రూపాయలు లాండరింగ్‌ జరిగిందని ఈ నెల మొదట్లోనే ఈడీ ప్రకటించింది. దానికి సంబంధించి కొందరిని అరెస్టు చేసింది కూడా. తాజాగా దీనికి చెందిన మరికొన్ని కంపెనీల్లోనూ సోదాలు జరిపినట్లు ప్రకటించింది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, చగన్‌ భుజబల్‌ వ్యవహారాలు కూడా ఇదివరకు ఈడీ పేర్కొన్నవే.

ఎల్లో మీడియాకు ఇది చాలదా!
 ఈడీ ట్వీట్లను పట్టుకుని, రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్ట్స్‌తో జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని, అదంతా ఈడీ చెప్పిందని, ఈ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌ జరిగిందని... ఇంకా ఏవేవో పచ్చి అబద్ధాలను వండేసింది ఎల్లో మీడియా. కనీసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనే పదాన్ని సరిగా పలకటం కూడా చేతకాకపోయినా... దానికి సొంత కవిత్వాన్ని జోడించి ఈ చానెళ్ల ప్రతినిధులు జగన్‌పై కథనాల్ని వండేయటం చూస్తే వీళ్ల ఎల్లో జర్నలిజం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం కాకమానదు. బహుశా.. ఇదంతా చూసో ఏమో.. ఈడీ సాయంత్రం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. అందులో వివిధ ఆరోపణలున్న పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లు చెబుతూ... వాటికి సంబంధించి తాము వివిధ కంపెనీల్లో సోదాలు జరిపామని మాత్రమే పేర్కొంది. ఈ ప్రకటనలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీలు... అని తప్ప ఒక్క కంపెనీ పేరుగానీ, వేరొక కంపెనీతో సంబంధాలున్నట్లు గానీ ఎక్కడా పేర్కొనలేదు. కానీ ఎల్లో మీడియాకు ఇదేమీ పట్టలేదు. ఎందుకంటే ఆ మూడు చానెళ్లు అప్పటికే వండాలనుకున్న కథనాల్ని వండేశాయి.

మూడు చానెళ్లకు లీగల్‌ నోటీసులు
కాగా రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్ట్‌ అనే కంపెనీ పేరు కూడా తమ క్లయింట్‌కు తెలియదని, అలాంటిది ఆ కంపెనీతో సంబంధాలు అంటగడుతూ.. కథనాలు ప్రసారం చేయటం ఉద్దేశపూరితంగా తన క్లయింట్‌ ప్రతిష్టను దెబ్బ తీయటానికేనని జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఏమాత్రం ధ్రువీకరించుకోకుండా, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ప్రసారం చేసిన ఈ వార్తాకథనాల వెనక తీవ్ర స్థాయి దురుద్దేశాలున్నట్లు వారు అభిప్రాయపడ్డారు. అందుకే సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీ చానెళ్లకు లీగల్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

రాజకీయం తప్ప ఏముందిందులో?
నిజానికి ‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులన్నీ రాజకీయ పూరితమైనవని ఆది నుంచీ నిరూపితమవుతూనే ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వదిలిపెట్టాక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి కేసులు వేయటం, మూడు నెలల్లో బెయిలు రావాల్సిన కేసులో... 16 నెలలకు పైగా జైల్లో ఉంచటం ఇవన్నీ తెలియనివేమీ కావు. అంతేకాదు.. సోదాల నుంచి మొదలు పెడితే ముక్కలు ముక్కలు చార్జిషీట్లు వేయటం వరకూ ఏ కేసులోనూ జరగని వింతలన్నీ ఈ కేసులోనే చోటుచేసుకున్నాయి. అసలు జగన్‌మోహన్‌రెడ్డిని ఏమాత్రం ప్రశ్నించకుండానే ఆయనపై తొలి చార్జిషీటును వేయటం చూస్తే... ఈ కేసు ఎలా సాగిందన్నది ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ దశలో కూడా ఏపీలో జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను దెబ్బతీయాలని, ఆయన పార్టీ నేతల్ని గందరగోళంలో పడెయ్యాలనే ఉద్దేశంతో చంద్రబాబు కేంద్ర స్థాయిలో తనకున్న లింకుల్ని ఉపయోగించి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాతో సహా పలు వర్గాల్ని రంగంలోకి దింపుతున్నారు. దర్యాప్తు పూర్తయి, విచారణ జరుగుతున్న ప్రస్తుత దశలో కూడా జగన్‌మోహన్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ సీబీఐ ఇటీవలే పిటిషన్‌ వేయటం గమనార్హం. ఆ పిటిషన్‌ విచారణకు వస్తున్న దశలో దాన్ని ప్రభావితం చెయ్యాలన్న ఉద్దేశంతో ఎల్లో మీడియా మళ్లీ శివాలెత్తటం వెనక పరిణామాల్ని తేలిగ్గానే ఊహించుకోవచ్చు.

మరిన్ని వార్తలు