ఎక్సైజ్‌ పాలసీ ఖరారు

12 Sep, 2017 01:18 IST|Sakshi
మద్యం దుకాణాలకు ఈనెల 13న నోటిఫికేషన్‌
 
సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు మద్యం కొత్త పాలసీ ఖరారైంది. రాష్ట్రంలో గతంలో ఉన్న ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులకు కుదించాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. గతంలో రూ. 50 వేలు ఉన్న దరఖాస్తు ఫీజును అర్బన్‌ ప్రాంతంలో రూ. లక్షకు పెంచారు. ఈ మేరకు ఎక్సైజ్‌ అధికారులు పంపిన ప్రతిపాదనలకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. దీంతో అధికారులు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 13న నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు ఈనెల 19గా నిర్ణయించారు.

22వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సులకు డ్రా నిర్వహిస్తారు. డ్రా నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పాత పాలసీలో ఆరు స్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును నాలుగు స్లాబులకు కుదించారు. మేజర్‌ గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో గతంలో రూ. 39.5 లక్షలు, రూ. 40.8 లక్షలుగా ఉన్న రెండు శ్లాబులను కలిపేసి రూ. 45 లక్షలతో ఒక శ్లాబు చేశారు. గతంలో 2 లక్షల నుంచి 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం షాపులకు రూ. 50 లక్షలు, రూ. 60 లక్షల శ్లాబులు ఉండగా, ఆ రెండింటిని కలిపి రూ. 55 లక్షలతో ఒకే శ్లాబు చేశారు.

3 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు గతంలో రూ. 81.6 లక్షల స్లాబు ఉండేది. తాజాగా పర్మిట్‌ రూమ్‌తో కలిపి ఈ శ్లాబును రూ. 85 లక్షలకు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గతంలో రూ. 1.08 కోట్లు ఉండగా, ఈసారి దానిని పర్మిట్‌ రూమ్‌తో కలిపి రూ. 1.10 కోట్లుగా నిర్ధారించారు. రెండేళ్ల లీజు కాలాన్ని ఎప్పటిలాగే కొనసాగించనున్నారు. 
మరిన్ని వార్తలు