పీజీ వైద్య యాజమాన్య సీట్లకు నోటిఫికేషన్‌

21 May, 2017 02:35 IST|Sakshi
పీజీ వైద్య యాజమాన్య సీట్లకు నోటిఫికేషన్‌

జారీ చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం
- ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం వరకు గడువు
- కన్వీనర్‌ కోటాలో రెండో దశలో మిగిలిన సీట్లకూ నోటిఫికేషన్‌


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని పీజీ యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకునే ప్రక్రియ శనివారం ఉదయం 11 గంటలకే ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. పీజీ నీట్‌–2017లో అర్హు లైన విద్యార్థులు ఎవరైనా ఈ ప్రవేశాలకు దర ఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలకు అర్హులు.

దరఖాస్తు అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించి రాష్ట్రంలోని 11 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఉన్న పీజీ, డిప్లొమా వైద్య సీట్లను, 8 డెంటల్‌ కాలేజీల్లోని ఎండీఎస్‌ సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను 24వ తేదీ సాయంత్రమే వెల్లడిస్తారు. 25న 25 శాతం యాజమాన్య కోటా సీట్లకు అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉస్మానియా యూనివర్సిటీలోని దూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తారు. అనంతరం అప్పటికప్పుడే కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటా యిస్తారు. ఇక 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా, 10 శాతం ఇన్‌స్టిట్యూషన్‌ కోటా సీట్లకు 26వ తేదీ ఉదయం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి సీట్లను కేటాయిస్తారు.

ఇక అదేరోజు మధ్యాహ్నం నుంచి ఎండీఎస్‌ సీట్ల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి సీట్లను కేటాయిస్తారు. 27వ తేదీ నాటికి తమకు కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరాలి. సీట్లు మిగిలితే 28వ తేదీన మరో సారి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అందులో సీటొచ్చిన విద్యార్థులు 29వ తేదీన చేరాలి. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే 30, 31వ తేదీల్లోనూ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు వెంటవెంటనే కాలేజీల్లో చేరాలి. ఈ నెల 31వ తేదీ నాటికి ఎలాగైనా పీజీ వైద్య అడ్మిషన్ల ప్రక్రియను ముగిస్తారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటులోని కన్వీ నర్‌ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ సీట్లలో చేరేం దుకు శనివారం మధ్యాహ్నంతో గడువు ముగి సింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలి పోయిన సీట్లను భర్తీ చేసేందుకు విశ్వవిద్యా లయం మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఇన్‌స్టిట్యూషన్‌ కోటా అంటే..?
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈసారి పీజీ మెడికల్‌ సీట్లలో ఇన్‌స్టిట్యూషన్‌ కోటా అంటూ ప్రత్యేక కేటగిరీని తీసుకొచ్చింది. ఇన్‌స్టిట్యూషన్‌ కోటాకు 10 శాతం సీట్లు కేటాయించారు. దీంతో పీజీ వైద్య సీట్లలో నాలుగు కేటగిరీలు అయ్యాయి. ప్రస్తుతం కన్వీనర్, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇన్‌స్టిట్యూషన్‌ కోటా ఇప్పటివరకు కర్ణాటకలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. సంబంధిత ప్రైవేటు మెడికల్‌ కాలేజీ సొంతంగా ఆ సీట్లను కేటాయించుకోవ డానికి వీలు కల్పించడమే ఈ కేటగిరీ ప్రత్యేకత. ప్రైవేటు మెడికల్‌ కాలేజీ లేదా అనుబంధ బోధనాసుపత్రిలో పనిచేసే వైద్యులు లేదా వారి పిల్లలు లేదా కాలేజీ యజమానుల పిల్లలకు ఈ కేటగిరీలో సీట్లు ఇచ్చుకోవచ్చు. సీట్లు తక్కువగా ఉండి డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ఆ కాలేజీ యాజమాన్యం నచ్చినవారికి ఇచ్చుకోవచ్చు. కాగా, వచ్చే ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీలోనూ ఇన్‌స్టిట్యూషన్‌ కోటాను తీసుకొచ్చే ఆలోచన ఉందని అంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా