విద్యా వలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్

7 Jul, 2016 02:15 IST|Sakshi

- తొలుత 9,335 పోస్టుల్లో నియామకానికి చర్యలు
- తరువాత మరో 2 వేలకుపైగా భర్తీకి నిర్ణయం
- శ్రీనివాస ప్రాంతానికి చెందిన వారికే ప్రాధాన్యం
- మెరిట్ ప్రకారం నియామకాలు.. టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ

 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వలంటీర్ల నియామకం కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు బుధవారం నోటిఫికేషన్లు జారీ చేశాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 9,335 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జిల్లాల చెందిన విద్యాశాఖ వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 
 ఆ దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని సంబంధిత మండల విద్యాధికారుల (ఎంఈవోల)కు అందజేయాలి. దరఖాస్తులను పరిశీలించి మండలాల వారీగా మెరిట్ జాబితాలను రూపొందించి నియామకాలు చేపడతారు. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యా వలంటీర్ల సేవలు వినియోగించుకుంటారు. వారికి నెలకు రూ.8 వేల గౌరవ వేతనం అందజేస్తారు.
 
 మార్గదర్శకాలివీ..
 విద్యా వలంటీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటే జీ ఇస్తారు. మండలాల వారీగా రోస్టర్ పాయింట్లను కేటాయించి, మెరిట్ జాబితాలను రూపొందించాలి. నియామకాల సమయంలో మాత్రం ఆయా నివాస ప్రాంతానికి చెందిన వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన వారు అందుబాటులో లేకపోతే పక్క గ్రామానికి చెందిన వారిని నియమిస్తారు. సంబంధిత గ్రామంలో, పక్క గ్రామంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే మండలం మెరిట్ జాబితాలోని జనరల్ లిస్టు నుంచి అభ్యర్థులను నియమిస్తారు.
 
 ఆ మండలంలో అభ్యర్థులు లేకపోతే పక్క మండ లానికి చెందిన వారిని నియమిస్తారు. ఇక విద్యా వలంటీర్‌గా నియమితులయ్యేవారు ఆ గ్రామంలోనే ఉండి బోధన చేపడతామని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీతో ఒప్పందం చేసుకోవాలని, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవ హరించే జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నియామకాలను ఈనెల 15లోగా పూర్తి చేయాలని, 16వ తేదీ నుంచి విద్యా వలంటీర్లు పాఠశాల్లో బోధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతమున్న ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేస్తున్నా.. పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య, అవసరాల ఆధారంగా త్వరలోనే మరో 2 వేలకుపైగా విద్యా వలంటీర్లను నియమించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తలు