నుమాయిష్ ప్రారంభం

2 Jan, 2016 01:50 IST|Sakshi
నుమాయిష్ ప్రారంభం

► ప్రారంభించిన సీఎం కేసీఆర్
► సొసైటీ విద్యా సంస్థలను విస్తరిస్తాం: మంత్రి ఈటల
► మైదానం భూములపై సొసైటీకి పూర్తి స్థాయి హక్కులు

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా హాజరై నుమాయిష్-2016 ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సొసైటీ పాలక మండలి, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సొసైటీ విస్తరణ కార్యకలాపాలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని ప్రకటిం చారు. ప్రతి ఏటా  కేవలం 45 రోజుల నుమాయిష్‌కే ఎగ్జిబిషన్ మైదానం పరిమితం కాకుం డా 365 రోజులూ ఇతర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కూడా నిర్వహించుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

ఎగ్జిబిషన్ మైదానం భూమిపై పూర్తిస్థాయి హక్కులను సొసైటీకి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే ప్రక్రియ పూర్తయిందని అన్నారు. రెవెన్యూ కార్యదర్శి సెలవుల్లో ఉన్న కారణంగా కొంత ఆలస్యమైందని, రెండు మూడు రోజుల్లో సొసైటీకి హక్కులు అందవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యాబోధన లభిస్తోందన్నారు. త్వరలో మరి న్ని జిల్లాలకు విద్యాసంస్థలను విస్తరించేందుకు సొసైటీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,  పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, సొసైటీ గౌరవాధ్యక్షడు అనిల్ స్వరూ ప్ మిశ్రా, కార్యదర్శి సత్యేందర్, సంయుక్త కార్యదర్శి ఆదిత్య, కోశాధికారి ఎస్‌వీఎస్ చా ర్యులు, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు