24 జిల్లాలతో తెలంగాణ

23 May, 2016 02:05 IST|Sakshi

- కొత్తగా 14 జిల్లాలు.. తుది జాబితా ఖరారు!
- కొత్త జిల్లాలుగా యాదాద్రి, భద్రాద్రి, జయశంకర్, కొమురం భీం
- వరంగల్‌లో జనగామకు బదులుగా మహబూబాబాద్
- రంగారెడ్డిలో అదనంగా వికారాబాద్ ఒక్కటే
- గద్వాల జిల్లా ప్రతిపాదనకు నో
- హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జిల్లాలుగా రాజధాని
- దీనిపై ప్రత్యామ్నాయాలుంటే సూచించాలని సీఎం ఆదేశం
- నేడు కలెక్టర్లతో సమావేశంలో మరోసారి చర్చ

 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో కొత్త జిల్లాల కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. తీవ్ర మల్లగుల్లాలు, వరుస సమీక్షల అనంతరం అధికార యంత్రాంగం 14 కొత్త జిల్లాలతో తుది జాబితాను ఖరారు చేసింది. దీంతో ఇప్పుడున్న పది జిల్లాలతో కలిపి మొత్తంగా 24 జిల్లాలతో తెలంగాణకు కొత్త రూపం రాబోతోంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మ్యాపులు, సరిహద్దుల వివరాలన్నీ భూపరిపాలనా ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్‌ఏ) సిద్ధం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా కొత్తగా భద్రాద్రి జిల్లాను... నల్లగొండ జిల్లాలోని భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.

ఇక ఇంతకుముందే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలను కొమురం భీం జిల్లాగా, వరంగల్‌లోని భూపాలపల్లిని ఆచార్య జయశంకర్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రజల నుంచి వెల్లువెత్తిన డిమాండ్లను పరిశీలించిన అధికార యంత్రాంగం... వరంగల్ జిల్లాలోని జనగామకు బదులుగా మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపింది. దీంతో అనూహ్యంగా మహబూబాబాద్‌కు కొత్త జిల్లాల జాబితాలో చోటు దక్కింది. ఇక నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా రానుంది.

సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో సిద్ధిపేటతోపాటు సంగారెడ్డిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో కామారెడ్డిని, కరీంనగర్‌లో జగిత్యాలను కొత్త జిల్లా కేంద్రాలుగా ఎంపిక చేశారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల కేంద్రం జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై అధికారులు సానుకూలంగా స్పందించలేదు. ఇక్కడ ముందుగా అనుకున్న మేరకే వనపర్తి, నాగర్‌కర్నూల్‌లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు.

రెండు రెండు జిల్లాలే..
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజనపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన అధికారులు... హైదరాబాద్‌ను రెండు జిల్లాలుగా, రంగారెడ్డిని రెండు జిల్లాలుగా మాత్రమే విభజించాలనే నిర్ణయానికి వచ్చారు. రంగారెడ్డిలో వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను, హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా చేయాలని తొలి నుంచీ ప్రతిపాదనలు ఉన్నాయి.

కానీ రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు. అయినా కూడా ఇతర ప్రత్యామ్నాయాలేమైనా ఉంటే సూచించాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మొత్తంగా కొత్త జిల్లాలకు సంబంధించి తుది జాబితా దాదాపు ఖరారయింది. దీనిపై సోమవారం జరుగనున్న జిల్లాల కలెక్లర్ల సమావేశంలో మరోసారి చర్చించనున్నారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇబ్బందులు, అభ్యంతరాలేమైనా ఉంటే తెలియజేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు.
 
 కొత్తగా వచ్చే జిల్లాలు..
 1. కొమురం భీం జిల్లా (మంచిర్యాల)
 2. జగిత్యాల
 3. ఆచార్య జయశంకర్ జిల్లా (భూపాలపల్లి)
 4. మహబూబాబాద్
 5. భద్రాద్రి జిల్లా (కొత్తగూడెం)
 6. యాదాద్రి (భువనగిరి)
 7. సూర్యాపేట
 8. వనపర్తి
 9. నాగర్‌కర్నూల్
 10. సంగారెడ్డి
 11. సిద్ధిపేట
 12. కామారెడ్డి
 13. వికారాబాద్
 14. సికింద్రాబాద్
 
 ప్రస్తుతమున్న జిల్లాలు
 1. ఆదిలాబాద్
 2. కరీంనగర్
 3. వరంగల్
 4. ఖమ్మం
 5. నల్లగొండ
 6. మహబూబ్‌నగర్
 7. మెదక్
 8. నిజామాబాద్
 9. రంగారెడ్డి
 10. హైదరాబాద్

మరిన్ని వార్తలు