గోదావరి జలాలకూ ఎసరు!

11 Dec, 2015 08:31 IST|Sakshi
గోదావరి జలాలకూ ఎసరు!

మిగులును ఎక్కువగా చూపుతున్న కేంద్ర జల వనరుల సంస్థ
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మరో అన్యాయం జరుగుతోంది. కృష్ణా నదీ జలాల వివాదాన్ని రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయంతో తీరని అన్యాయం జరుగుతుండగా... ఇప్పుడు గోదావరి మిగులు జలాలకు ఎసరు పెట్టేలా కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమయ్యే నీటిని పరిగణనలోకి తీసుకోకుండా.. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయంటూ ‘అదనపు’ లెక్కలు వేస్తోంది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో... నిర్మితమైన, నిర్మితమవుతున్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ కలిపి 628.64 టీఎంసీలనే వినియోగించుకోనున్నారని, మిగతావన్నీ మిగులు జలాలేనని చెబుతోంది. 773 టీఎంసీల మేర నీటి వినియోగం ఉంటుందని రాష్ట్రం చెబుతున్నా పట్టించుకోకుండా.. తాను వేసిన లెక్కలనే నదుల అనుసంధాన ంపై ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదించేందుకు సిద్ధమవుతోంది.

 ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఏపీల్లోని గోదావరి, కృష్ణా నదులను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి వరకు నదులను అనుసంధానించే ప్రక్రియను కేంద్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో ఏపీ, తెలంగాణకున్న 1,480 టీఎంసీల కేటాయింపుల్లో 530 టీఎంసీల మిగులు జలాలున్నట్లు కేంద్రం అంచనా వేసింది. ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి మిగులు జలాలను కృష్ణాకు, అటు నుంచి పెన్నా నదికి తరలించాలని ప్రణాళిక వేసింది. అయితే గోదావరి మిగులు జలాల లెక్కలపై తొలి నుంచి విభేదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ అవసరాలు తీరాకే మిగులు జలాల తరలింపు చేయాలని కోరుతోంది. మరోవైపు మిగులు జలాల లెక్కల్లో తేడాలు ఉండటంతో 2015 లెక్కల ఆధారంగా లభ్యతను గుర్తించాలని కేంద్ర టాస్క్‌ఫోర్స్ కమిటీ గత నెలలో ఎన్‌డబ్ల్యూడీఏకు సూచించగా... ఎన్‌డబ్ల్యూడీఏ ఇటీవలే కేంద్రానికి తన లెక్కలను సమర్పించినట్లు తెలిసింది.

 లెక్కల్లో అంతరం ఇలా..
 ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కల మేరకు..రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో కలిపి మొత్తంగా 628 టీఎంసీలు వినియోగిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 230.33 టీఎంసీలు, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి వద్ద 178.605 టీఎంసీల అవసరాలు ఉంటాయని అంచనా వేశారు. రాష్ట్రం చెబుతున్న లెక్కల మేరకు.. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద వినియోగం 250.334 టీఎంసీలుకాగా.. ప్రాణహిత, ఇచ్చంపల్లి కింద 286.612 టీఎంసీల నీటిని వాడుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. దీనికితోడు ఎన్‌డబ్ల్యూడీఏ కొన్ని ప్రాజెక్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకోలేదు.

ఆ అవసరాలు మరో 40 టీఎంసీలు ఉంటాయి. వీటితో పాటే దేవాదులతో వినియోగంలోకి రానున్న 38.18 టీఎంసీలు, నిజాంసాగర్‌లో ఏర్పడిన లోటు 40 టీఎంసీలు కలుపుకొంటే రాష్ట్రం వినియోగించుకునే జలాలు 773.03 టీఎంసీలు ఉంటాయి. ఇద్దరి మధ్య 144.39 టీఎంసీల తేడా వస్తోంది. ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కల మేరకు అందుబాటులో ఉండే మొత్తం 954 టీఎంసీలతో పోలిస్తే మిగులు 325.59 టీఎంసీలకు చేరుతుంది. ఈ నీటినంతటినీ గోదావరి-కృష్ణా అనుసంధానం ద్వారా పెన్నాకు తరలించాలని కేంద్రం యత్నిస్తోంది.
 
 లెక్కలపై తొందర వద్దు..
 మిగులు జలాల లెక్కలపై తొందర వద్దని ఎన్‌డబ్ల్యూడీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు.. గోదావరి నీటిలో భాగస్వామ్య రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు పోగా మిగిలిన నీరంతా ఉమ్మడి ఏపీకే చెందుతుంది. ఉమ్మడి ఏపీలో భాగమైన తెలంగాణకు కూడా మిగులులో వాటా ఉంటుంది. ఆ నీటిని ఆరుతడి పంటలకు ఉపయోగించుకొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తమ ప్రయోజనాలు, అదనపు ఆయకట్టు సృష్టికి విఘాతం కలిగేలా నిర్ణయం ఉండరాదని కోరుతోంది. దీనిపై కేంద్రం ఎలా స్పంది స్తుందన్నది ప్రధానం.

మరిన్ని వార్తలు