ఆబ్జెక్టివ్‌లో నెగిటివ్ మార్క్స్

28 Sep, 2016 07:13 IST|Sakshi
ఆబ్జెక్టివ్‌లో నెగిటివ్ మార్క్స్

* ఏపీపీఎస్సీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం
* తప్పుడు సమాధానం గుర్తిస్తే ఒక్కోప్రశ్నకు 1/3 మైనస్ మార్కు
* నెలాఖరులోపు మరో 256 పోస్టులకు నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల కు నెగిటివ్ (మైనస్) మార్కుల విధానాన్ని అమలు చేయాలని కమిషన్ నిర్ణయించింది. తప్పుడు సమాధానం గుర్తిస్తే ఒక్కో ప్రశ్నకు 1/3 మార్కు చొప్పున తగ్గించనుంది. యూపీఎస్సీ, ఎస్సెస్సీ తరహా విధానాన్ని అనుసరించనుంది.

కొందరు తెలి యని వాటికీ ఏదో ఒక ఆప్షన్ సమాధానాన్ని గుర్తిస్తూ  అదృష్టవశాత్తు అది కరెక్టు అయితే అధిక మార్కులు పొందుతున్నారు. దీన్ని నిరోధించడానికి నెగిటివ్ మార్కుల విధానాన్ని ఎంచుకోవాలని మంగళవారం జరిగిన ఏపీపీఎస్సీ బోర్డు సమావేశం నిర్ణయించింది. చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ అధ్యక్షతన  సమావేశం జరిగింది.
 
* ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్లనుంచి 40 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. ఆ వయోపరిమితి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. గ్రూప్2, గ్రూప్3 పోస్టుల నోటిఫికేషన్ల విడుదల జాప్యమైతే వయోపరిమితి పెంపు జీవో మరో ఏడాది పొడిగింపునకు రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. దీనివల్ల ఈ నెలాఖరుతో 40 ఏళ్లు నిండిపోయే వారికి రానున్న ఏడాదిలో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లకు అర్హత కల్పించనున్నారు. ఈ నెలాఖరులోగా వివిధ విభాగాలకు సంబంధించిన 256 పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు.

* స్క్రీనింగ్ టెస్టునుంచి 1:50 చొప్పున అభ్యర్థులను రోస్టర్‌తో సంబంధం లేకుండా మెరిట్ ప్రాతిపదికన మెయిన్ పరీక్షకు ఎంపిక చే స్తారు. కటాఫ్ మార్కును నిర్ణయించి ఆమేరకు ఎంతమంది అర్హులో అందరినీ మెయిన్‌కు పిలుస్తారు. కొద్దికాలంలో దీన్ని కూడా మార్పు చేసి యూపీఎస్సీ తరహాలో స్క్రీనింగ్ టెస్టునుంచి మెయిన్స్‌కు 1:12, లేదా 1:13 చొప్పున రోస్టర్ తదితర రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులను  పిలవాలని సమావేశంలో చర్చించారు.

ఈమేరకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. ళీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన 748 ఏఈఈ పోస్టులకు స్రీనింగ్ టెస్టుతో పాటు మెయిన్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్లో నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్టు అక్టోబర్‌లోనే నిర్వహించేలా షెడ్యూల్ ఇవ్వనున్నారు.

* స్క్రీనింగ్ టెస్టు, మెయిన్  టెస్టుకు ఒకే తరహా సిలబస్ ఉంటుంది. మెయిన్ టెస్టులో మూడు పేపర్లు ఉంటాయి. ఈ మూడింటి నుంచి 50 మార్కుల చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తారు. ప్రశ్నలు స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ టెస్టులో ఒకే తరహాలో ఉంటాయి. ప్రశ్నలు, సమాధానాల ఆప్షన్లు జంబ్లింగ్ విధానంలో ఉంటాయి.

* గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఈసారి ఇంటర్వ్యూలు ఉండవు. వచ్చే ఏడాదినుంచి గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి గ్రూప్-1 బీగా భర్తీచేస్తారు. వీటికి ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు ఇంటర్య్వూలూ ఉంటాయి.

* గ్రూప్-1 పోస్టుల కొత్త నోటిఫికేషన్లు, భర్తీ డిసెంబర్‌నాటికి చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు