గూబ‘గుయ్’మంది

28 Jan, 2014 02:03 IST|Sakshi
  • ఉద్యోగులు, అధికారుల్లో సెల్ బిల్లుల పరేషాన్
  •   పరిమితి మించిన గ్రూప్ సెల్‌ఫోన్ బిల్లులు
  •   చెల్లించకుంటే చర్యలు తప్పవన్న కలెక్టర్
  •  
    సాక్షి,సిటీబ్యూరో:  హైదరాబాద్ జిల్లా రెవెన్యూ విభాగంలో పనిచేస్తోన్న ఉద్యోగులకు, అధికారులకు ఒక్కసారిగా గుండె గుభేల్‌మంది. ఎందుకంటారా! .. ఏమీ లేదండీ.. జిల్లా కలెక్టర్  నుంచి తాజాగా వారికి అందిన తాఖీదులను చూసి వారంతా షాక్ గురయ్యారు. మీరు వాడుతున్న కామన్ యూజర్ గ్రూప్(సీయూజీ) సెల్‌ఫోన్ బిల్లు పరిమితికి మించినందున ఆ సొమ్మును వెంటనే చెల్లించాలని ఆ తాఖీదు సారాంశం. జిల్లా పరిపాలనను మరింత ప్రభావ వంతం చేసేందుకని అధికారులకు, ఉద్యోగులకు కామన్ యూజర్ గ్రూప్ సెల్‌ఫోన్లను ప్రభుత్వం ఇచ్చింది.
     
    అయితే ఆయా ఉద్యోగుల, అధికారుల స్థాయిని బట్టి పరిమితిని విధించింది. గెజిటెడ్ అధికారులకు రూ.625కాగా, డిప్యూటి సెక్రటరీ హోదా వారికి రూ.1375, సెక్రటరీ కేడర్ అధికారులకు రూ.రెండు వేలు పరిమితిగా నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోనే కదాని కొందరు సొంతానికి వాడుకున్నారో లేక ప్రజోపయోగ కార్యక్రమాలకే వినియోగించారో తెలియదు కానీ దాదాపు అన్ని సీయూజీ ఫోన్లకు ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వచ్చాయి.
     
    పరిమితి మించి పరేషాన్!
     
    చెల్లింపు నిమిత్తం బిల్లులను పేఅండ్ అకౌంట్స్ విభాగానికి కలెక్టరేట్ అధికారులు పంపగా, పరిమితికి మించినందున తాము అంగీకరించే ది లేదని పీఏవో అధికారులు వాటిని తిప్పిపంపారు. దాంతో లిమిట్ దాటి సెల్‌ఫోన్ వాడుకున్న 70మంది ఉద్యోగులు, అధికారులు సదరు సొమ్మును వెంటనే చెల్లించాలని, వారంలోగా ‘కలెక్టర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్’పేరిట డిమాండ్ డ్రాఫ్టులు పంపకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తాఖీదులు జారీ చేశారు.

    రూ.1000 లోపు అధికంగా సెల్ బిల్లు వచ్చిన వారు 49మంది ఉండగా, 21మందికి మాత్రం రూ.1000 నుంచి రూ.5000లకు పైగా బిల్లు వచ్చింది. కీలకమైన విభాగాలకు చెందిన పనుల నిమిత్తం రెవెన్యూ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులతోనూ, ప్రైవేటు వ్యక్తులతోనూ మాట్లాడాల్సి ఉంటుందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ పనికే సెల్‌ఫోన్ వాడినప్పటికీ అదనపు బిల్లుల పేరిట తమ జేబులకు చిల్లులు పెట్టడం ఎంతవరకు సబబని కొందరు ప్రశ్నిస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు