గుడుంబా సొమ్ము గుటుక్కు!

27 Jan, 2018 02:54 IST|Sakshi
పునరావాస పథకం కింద అందిన గొర్రెలతో లబ్ధిదారు

పునరావాస పథకంలో అధికారుల చేతివాటం

లబ్ధిదారులకు అందాల్సిన సొమ్ము పక్కదారి 

రూ.2 లక్షల్లో అందుతోంది సగమే    

ఇదేంటని అడిగితే ‘జాబితా నుంచి తొలగిస్తాం’ అంటూ బెదిరింపులు

‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగుచూసిన చేదు వాస్తవాలు

సాక్షి, నెట్‌వర్క్‌: వారందరికీ గుడుంబా తయారీనే ఉపాధి.. చట్ట వ్యతిరేకమని తెలిసినా చేసేదేమీ లేక దానితోనే పొట్టబోసుకోవాల్సిన పరిస్థితి.. పట్టుబడినప్పుడల్లా కేసులు.. పోలీస్‌ స్టేషన్ల మెట్లెక్కడం.. జరిమానాలు.. జైలుశిక్షలు మామూలే..! ఎన్నో ఏళ్లుగా ఇలా దుర్భర జీవితాలు గడుపుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకానికి సైతం అక్రమాల చీడ పట్టుకుంది. అధికారుల ఆమ్యామ్యాలతో లబ్ధిదారులకు అందాల్సిన సొమ్ము పక్కదారి పడుతోంది. ‘గుడుంబా ఆధారిత కుటుంబాల పునరావాస పథకం (జీఈపీఆర్‌ఎస్‌)’ లబ్ధిదారులను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పలకరించగా అనేక విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. 

ఎక్కువ మాట్లాడితే.. పేరు తీసేస్తాం.. 
గుడుంబా తయారీదారులకు జీఈపీఆర్‌ఎస్‌ కింద రూ.2 లక్షలతో ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. అందులో అధికారులే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏ జిల్లాలో చూసినా లబ్ధిదారులకు రూ.2 లక్షల లబ్ధి చేకూరిన దాఖలాలు కనిపించడం లేదు. రూ.లక్ష లేదా లక్షన్నర వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ‘అదంతే.. ఎక్కువగా మాట్లాడితే జాబితా నుంచి పేర్లు తొలగిస్తాం. ఉన్న సామగ్రి రికవరీ చేసి వేరే వారిని ఎంపిక చేస్తాం’అని దబాయిస్తున్నట్లు పలువురు లబ్ధిదారులు వాపోయారు. పలు జిల్లాల్లో సామగ్రిని అధికారులే కొనుగోలు చేసి దొంగ బిల్లులు ఇచ్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. పలువురు లబ్ధిదారులు సాయం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. 

అవినీతికి తెరలేచిందిలా.. 
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి కారణంగా పథకంలో అవినీతి చోటుచేసుకుంది. ఫలితంగా లబ్ధిదారులకు రుణాలు సరైన రీతిలో అందడం లేదు. ఎక్సైజ్‌ అధికారులతోపాటు ఎంపీడీవో జాయింట్‌ సర్వే చేసి రుణాలు అందించాల్సి ఉంది. రుణ లబ్ధిదారుల ఎంపిక, ఆయా కార్పొరేషన్ల నుంచి వచ్చిన చెక్కుల అందజేత వంటి అంశాలు ఎక్సైజ్‌ సీఐ స్థాయి అధికారితోపాటు ఎంపీడీవోలు పర్యవేక్షించాల్సి ఉంది. రుణాల మంజూరుకు చెందిన గ్రౌండింగ్‌పై ఎంపీడీవో, ఎౖMð్సజ్‌ అధికారులు ఎప్పటికప్పుడు జాయింట్‌ సర్వేలు చేయాలి. కానీ కొందరు ఎంపీడీవోలు నామమాత్రంగా వ్యవహరించడంతో ఎక్సైజ్‌ అధికారులు కమీషన్ల దందాలకు తెరలేపారు. ఫలితంగా రుణాల మంజూరులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. 

ఇదిగో మరకలు.. 
పథకం కింద జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఎక్సైజ్‌ సర్కిల్‌కు 46 యూనిట్లను కేటాయించారు. ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.92 లక్షలు విడుదల చేశారు. దీంతో లబ్ధిదారులు కిరాణం, బ్రిక్స్, కూల్‌డ్రింక్స్, గొర్రెలు, గేదెల పెంపకం తదితర వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో 17 కిరాణా దుకాణాలకు సంబంధించి స్థానిక ఎక్సైజ్‌ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది. స్థానిక సీఐ, ఎస్సైలు అవినీతికి పాల్పడ్డారని తేలడంతో వారిపై వేటు వేశారు.

ఎన్నెన్నో అక్రమాలు
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పి.శ్రీనివాస్‌కు టెంట్‌హౌస్‌ పెట్టుకోవడానికి ఎక్సైజ్‌ పోలీసులు రూ.2 లక్షల విలువైన సామగ్రి ఇప్పించారు. 2017 ఆగస్టు 28న హైదరాబాద్‌ నుంచి సామగ్రి తీసుకొచ్చి టెంట్‌హౌజ్‌ ప్రారంభించారు. కానీ ఆ సామగ్రి అంతా కలిపి రూ.1.20 లక్షలు మాత్రమే విలువ చేస్తుందని, అధిక రేట్లు వేసి సొమ్ము చేసుకున్నారని శ్రీనివాస్‌ చెబుతున్నాడు. 
- కుమ్రం భీం జిల్లాలో నలభై మంది లబ్ధిదారులను గుర్తించారు. అందులో తొలివిడతగా గతేడాది జూలైలో 19 మందికి యూనిట్లు అందజేశారు. 15 మందికి రూ.లక్ష చొప్పున, నలుగురికి రూ.2 లక్షల చొప్పున అందించారు. అయితే ఇందులో మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. రూ.లక్ష విలువైన 20 గొర్రెలు/మేకలు పంపిణీ చేయగా.. కొద్దిరోజుల్లోనే వాటిల్లో సగానికిపైగా మృత్యువాత పడ్డాయి. ఇన్సూరెన్స్‌ కోసమని రూ.ఐదు వేలు వసూలు చేసినా.. ఇన్సూరెన్స్‌ చేయించలేదు. 

ఇదీ పథకం..
రాష్ట్రంలో సారా/గుడుంబా వాసన లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే కిందటేడాది మార్చిలో జీఈపీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద గుడుంబా తయారీదారులు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేలా రూ.2 లక్షలు మంజూరు చేస్తారు. ఆ మొత్తంతో కిరాణా దుకాణాలు, టెంట్‌హౌస్‌లు, చికెన్‌ షాపులు, బట్టల వ్యాపారం, సూపర్‌ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారిని లబ్ధిదారులుగా గుర్తించి బ్యాంకుల నుంచి కాకుండా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఉంటుంది. ఇందులో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, ఎస్పీ, డీఆర్‌డీవో, జిల్లా బీసీ, గిరిజన సంక్షేమశాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి, స్త్రీ, శిశు సంక్షేమం, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖల అధికారులు ఉంటారు.

ఉచితంగా ఇస్తున్నాం.. ఏదో ఒకటి తీసుకో..
ఈ ఫొటోలో ఆవుకు నీళ్లు తాగిస్తున్న వ్యక్తి మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రభాకర్‌. ఆయనకు గుడుంబా పునరావాస పథకం కింద రూ.2 లక్షలతో యూనిట్‌ మంజూరు చేశారు. మూడు పాడి ఆవులు ఇప్పిస్తామని చెప్పారు. ఏడాదిపాటు తిరిగాక.. చిత్తూరు జిల్లా పులమనూర్‌లో మధ్యవర్తి ద్వారా ఆవులు ఇప్పించారు. ఇవి బలహీనంగా ఉన్నాయంటే.. ‘ఉచితంగా వస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకో’అంటూ దబాయించారు.

చికెన్‌ సెంటర్‌కు రూ.2 లక్షలా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కుందారపు చంద్రయ్య. గోదావరిఖనిలోని జీఎం కాలనీ. ప్రభుత్వం గుడుంబా పునరావాసం కింద చికెన్‌ సెంటర్‌ పెట్టుకోవాలని నిర్ణయించాడు. చంద్రయ్యకు రూ.2 లక్షలు మంజూరయ్యాయి. దీంతో అధికారులు కోళ్లను ఉంచే ఇనుప జాలి, ఈకలు పీకే యంత్రం, చికెన్‌ కొట్టే కర్ర మొద్దు, కత్తులు, ఫ్రిడ్జ్‌ కొనిచ్చారు. కానీ తర్వాత లెక్కలు వేస్తే అన్నీ కలిపి రూ.60 వేలకు మించవని తేలింది. మిగతా డబ్బుల కోసం అధికారుల వద్దకు వెళితే.. మొత్తం సొమ్ము ఆ సామగ్రికే ఖర్చయిందని చెప్పి పంపేశారు.

అడిగితే స్కీం రద్దు చేస్తామన్నరు  
ఈయన పేరు దోరి ఐలయ్య. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం. జీవనోపాధి కల్పిస్తామని అధికారులు చెబితే గుడుంబా అమ్మడం మానేశాడు. పిండి గిర్ని నడుపుకొంటానంటే ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసింది. కానీ అధికారులు ఇచ్చిన సామగ్రి విలువ రూ.60 వేలకు మించి ఉండదు. ఇదేమిటని అడిగితే స్కీం రద్దు చేసి వేరే వారికి ఇస్తామని అధికారులు బెదిరించారని ఐలయ్య వాపోతున్నాడు.

జీఎస్టీ కింద రూ.36 వేలు కట్‌..! 
ఈయన పేరు బల్వీందర్‌సింగ్‌. రాజన్న సిరిసిల్ల సిక్కువాడి. ఏడుగురు పిల్లలు. జీవనోపాధి కోసం 15 ఏళ్లుగా సారా అమ్ముతున్న బల్వీందర్‌పై ఐదారు సార్లు కేసులు నమోదయ్యాయి. సారా అమ్మడం మానేయడంతో రూ.2 లక్షలు మంజూరయ్యాయి. దాంతో అధికారులు రెండు వెల్డింగ్‌ మిషన్లు, డ్రిల్లింగ్, గ్రైండర్, షెటర్‌ ఫిటింగ్‌ మిషన్లు కొనివ్వగా.. బల్వీందర్‌ మరో రూ.50 వేలు ఫైనాన్స్‌లో తెచ్చుకుని ఇతర పరికరాలు కొనుక్కున్నాడు. కానీ అధికారులు రెండు లక్షల సాయంలో జీఎస్టీ అని రూ.36 వేలు కట్‌ చేసుకున్నారని వాపోతున్నాడు.  

మరిన్ని వార్తలు