ఇంకుడు గుంతల ఏర్పాటులో అధికారుల వైఫల్యం

18 Jul, 2014 03:01 IST|Sakshi
ఇంకుడు గుంతల ఏర్పాటులో అధికారుల వైఫల్యం

* వర్షం నీరు ఇంకే దారి కరువు
* 60 శాతం వృథా అవుతున్న తీరు
* వాల్టా చట్టం అపహాస్యం

 
క్రీట్ జంగిల్‌గా మారిన రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భవనాల సంఖ్య సుమారు22 లక్షలు. కానీ వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అందుబాటులో ఉన్న రీఛార్జింగ్ పిట్స్(ఇంకుడు గుంతలు) 25 వేలు మాత్రమే. ఇది భూగర్భ జలశాఖ ప్రకటించిన చేదు వాస్తవం. నగరంలో వర్షపు నీటిని ఒడిసి పట్టే దారి లేకపోవడంతో పాతాళ గంగ కనుమరుగవుతోంది. మహానగరం పరిధిలో సంవత్సర వార్షిక సగటు వర్షపాతం 812 మిల్లీమీటర్లు.

ఇందులో సుమారు 65 శాతం అంటే 527.8 మిల్లీమీటర్ల మేర వర్షపు నీరు వృథా అవుతున్నట్లు భూగర్భ జలశాఖ అంచనా వేసింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో వర్షపు నీటి  వృథా కేవలం 40 శాతమే. అంటే మన నగరంలో అదనంగా 25 శాతం వర్షపు నీటిని చేతులారా కోల్పోతున్నామన్న మాట. ఈ పరిస్థితితో నిజాంపేట్, బోడుప్పల్, మియాపూర్, చందానగర్ తదితర శివారు ప్రాంతాల్లో సుమారు 1500 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వి ఉసూరుమనాల్సిన దుస్థితి సిటీజనులది.    
 
- ఏసిరెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్
 
1500 అడుగుల లోతు వరకు కానరాని నీరు
 
సర్కారు విభాగాల వైఫల్యమిది
భూగర్భ జల మట్టాలను పెంపొందించేందు కు రీచార్జింగ్ పిట్స్ తవ్వాల్సిన అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పించడంలో జలమండలి, జీహెచ్‌ఎంసీలు విఫలమవుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల సమయంలో రీచార్జింగ్ పిట్స్ తవ్వేందుకు జీహెచ్‌ఎంసీ నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తుంది. జల మండలి కూడా నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినపుడు వినియోగదారుల నుంచి విస్తీర్ణాన్ని బట్టి రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకు ముక్కుపిండి రాబడుతున్నారు. వినియోగదారుడు సొంతంగా పిట్ ఏర్పాటు చేసుకున్నట్లు క్షేత్ర పరిశీలన సమయంలో తేలితే ఈ మొత్తాన్ని మినహాయిస్తున్నారు.
 
పాతాళంలో గంగ...
గ్రేటర్ పరిధిలోని 13 మండలాల్లో పరిస్థితి విషమించింది.
గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి మరింత లోతునకు జలమట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని సుమారు 870 కాలనీలు, 1500 మురికివాడల్లో నివసిస్తున్న సుమారు 35 లక్షలమందికి కన్నీటి కష్టాలు షరా మామూలవుతున్నాయి.
 
దుస్థితికి కారణాలివి...
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు(రీచార్జ్ పిట్స్) ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ, జల మండలి నగరంలో వినియోగదారుల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.64 కోట్లు వసూలు చేశాయి. ఆ నిధులతోఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో భూగర్భ జలాలు అధఃపాతాళానికి మళ్లుతున్నాయి.

దీంతో విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వడాన్ని నిషేధిస్తూ తొమ్మిదేళ్ల క్రితం చేసిన వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లో రీచార్జింగ్ పిట్స్ తవ్వే ప్రక్రియను మహోద్యమంగా చేపట్టాల్సిన సంబంధిత విభాగాలు నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి విషమిస్తోందని పర్యావరణ వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
పరిష్కార  మార్గాలు..
* భూగర్భ జలమట్టాలను గణనీయంగా పెంపొందించేందుకు ప్రతి ఇల్లు, కార్యాలయం,భవనానికి ఇంకుడు గుంతను బోరుబావికి దగ్గరగా విధిగా ఏర్పాటు చేయాలి.
* ఇంకుడు గుంతల ఏర్పాటును జలమండలి, జీహెచ్‌ఎంసీ విభాగాలు మహోద్యమంగా చేపట్టాలి. ఈ కృషిలో  ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు వారిలో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి.
* గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవంతుల వద్ద మినీ మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇందులో శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఎక్కడికక్కడే భూగర్భంలోకి మళ్లించే ఏర్పాట్లు చేయాలి.
* గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యికి పైగా ఉన్న లోతట్టు ప్రాంతాల(లోలైన్ ఏరియాల్లో)లో ఇంకుడు కొలనులు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో వర్షపునీటిని నిల్వచేయాలి. ప్రతి కాలనీ పార్క్‌ల్లోనూ వీటిని నెలకొల్పాలి.
 
లక్షల్లో భవంతులు... వేలల్లో ఇంకుడు గుంతలు..
గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి నిల్వకు పాతిక వేల ఇంకుడు గుంతలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు భూగర్భ జలశాఖ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇందులోనూ సుమారు ఐదు గుంతలపై మట్టి, పెద్ద బండరాళ్లు, సిమెంట్, చెత్తాచెదారం పడడంతో వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చే పరిస్థితి లేదని తేలింది.
 
ఇంకుడు గుంత ఇలా ఉండాలి..
మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇల్లు నిర్మించుకుంటే బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
పరిమాణం: పొడవు: 2 మీటర్లు, వెడల్పు: 2 మీ, లోతు: 1.5 మీ నింపే విధానం: 50 శాతం 40 ఎంఎం సైజులో ఉండే పలుగురాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లు, 15 శాతం బఠానీ ఇసుక, 10 శాతం ఖాళీగా ఉంచాలి.భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భ జలాల రీచార్జీ సులువవుతుంది.

మరిన్ని వార్తలు