‘జిల్లా’లపై జోరుగా కసరత్తు

7 May, 2016 02:18 IST|Sakshi
‘జిల్లా’లపై జోరుగా కసరత్తు

ఆ 15 జిల్లాలేవి.. ఎక్కడెక్కడ!
♦ క్షేత్రస్థాయిలో అధికారుల కసరత్తు
♦ త్వరగా పూర్తి చేయాలంటూ నేతల ఒత్తిళ్లు
♦ కొత్త జిల్లాల కోసం పలుచోట్ల ఆందోళన
♦ వాటిలో చేర్చే ప్రాంతాలపైనా పీటముడి
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు మొదలైంది. వచ్చే జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాలను ప్రకటిస్తామని స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలంగాణలో ఇప్పుడున్న పది జిల్లాలకు అదనంగా మరో 14 లేదా 15 కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. వీటితోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వవ్యస్థీకరణకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏవన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

 సన్నాహాలు పూర్తి..
 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అధికారిక సన్నాహాలు పూర్తి చేసింది. దీనిపై కసరత్తు చేసేందుకు గత సెప్టెంబరులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలో నలుగురు కార్యదర్శులతో కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫామేషన్ యాక్ట్-1974ను తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫామేషన్ యాక్ట్‌గా పరిగణిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కమిటీ ఇప్పటికే తొలి నివేదిక సిద్ధం చేసింది. పాలనా సౌలభ్యంతో పాటు భౌగోళికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలను బట్టి కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులుండేలా ప్రతిపాదనలు రూపొందించింది. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు ఆ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండాలని, రవాణా సదుపాయాలతో పాటు మౌలిక వసతులున్న ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

 కరీంనగర్, వరంగల్‌తో పీటముడి
 పలు ప్రాంతాలను కొత్త జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు, సీఎం హోదాలోనూ కేసీఆర్ వాగ్దానం చేశారు. దాంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలుచోట్ల స్పష్టమైన సంకేతాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కరీంనగర్‌లో జగిత్యాల, వరంగల్‌లో భూపాలపల్లి, మెదక్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండలో సూర్యాపేటలను జిల్లాలుగా మారుస్తామని పలు సందర్భా ల్లో సీఎం ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్‌కర్నూలు, వనపర్తిలను, ఖమ్మం జిల్లాలో కొత్తగూడాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తుది పరి శీలనలో ఉన్నాయి.

రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను నాలుగు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్తగా వికారాబాద్, ఇబ్రహీంపట్నం, చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న యోచన ఉంది. అయితే ఏయే ప్రాంతాలను ఏ జిల్లా పరిధిలో చేర్చాలనే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.  వరంగల్, కరీంనగర్ జిల్లాలపై పీట ముడి నెలకొందని చెబుతున్నారు. అందుకే అన్ని జిల్లాలకూ అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను గుర్తించి కొత్త జిల్లాలపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.

 పాలమూరులో ఆందోళనలు..
 కొత్త జిల్లాల కోసం రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి డిమాండ్లు తీవ్రస్థాయికి చేరాయి. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, జనగాంలను జిల్లా కేంద్రాలుగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ములుగు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు సీఎస్‌కు వినతి పత్రమిచ్చారు. మహబూబ్‌నగర్‌లో గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఏర్పడ్డ జేఏసీ మూడు నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తోంది. ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌లను జిల్లాలుగా మార్చాలని రంగారెడ్డి ప్రాంత ప్రతినిధులు కోరుతున్నారు.
 
 నేతల నుంచి ఒత్తిడి..
 కొత్త జిల్లాల ఏర్పాటును వీలైనంత తొందరగా పూర్తి చేయాలంటూ మంత్రులు, అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొంతకాలంగా సీఎంపై ఒత్తిడి పెంచారు. నియోజకవర్గాల పెంపు, కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ తమ సెగ్మెంట్లు మార్పుచేర్పులకు గురైతే తమ రాజకీమ భవిష్యత్తు ప్రభావితమవుతుంది గనుక రాబోయే ఎన్నికలను దృష్ట్యా ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే నిలదొక్కుకునేందుకు తమకూ సమయముంటుందని వీరంతా సీఎంను కోరుతున్నారు. నిజానికి విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను ప్రస్తుత 119 నుంచి 153కు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది. దాంతో వీటికి అనుగుణంగానే కొత్త జిల్లాలు అవతరిస్తాయనే ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్రం నుంచి ప్రస్తుతానికి స్పష్టత గానీ, సానుకూల సంకేతాలు గానీ లేవు. ఈలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తెరపైకి తీసుకురావటంతో రాజకీయ శ్రేణుల్లో కలకలం మొదలైంది.

మరిన్ని వార్తలు