పెళ్లిరోజున పాత జ్ఞాపకాలు

11 Sep, 2016 02:48 IST|Sakshi
పెళ్లిరోజున పాత జ్ఞాపకాలు

చంద్రబాబు మనసులో మాట

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పెళ్లిరోజున మనస్సు విప్పారు... విలేకరులతో ఇష్టాగోష్టి సందర్భంగా నాటి  జ్ఞాపకాలను పంచుకున్నారు. చంద్రబాబు వివాహం భువనేశ్వరితో చెన్నైలో 1981 సెప్టెంబర్ పదో తేదీన జరిగింది. శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  నేతలు , అధికార, అనధికార ప్రముఖులు ఆయనకు 35వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గత స్మృతులు ఆయన మాటల్లోనే...
 

23 ఏళ్లకే ఎమ్మెల్సీగా...
23 సంవత్సరాల వయస్సులోనే ఎమ్మెల్సీగా చిత్తూరు, నెల్లూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగా. నా వల్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న ఆనం సంజీవరెడ్డి ఓటమి పాలవుతారన్న భయంతో కొందరు నేతలు వెంగళరావుకు చెప్పటంతో ఆయన నన్ను పిలిపించుకుని మాట్లాడారు. వయస్సు చాలకుండా ఎమ్మెల్సీగా బరిలోకి దిగినా చివర కు గౌరవప్రదంగా బరిలో నుంచి తప్పుకున్నా.

 
తొలిసారి మంత్రిని ఎలా అయ్యానంటే...
1978లో ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎన్నికయ్యాను. వెంటనే ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి దగ్గకు వెళ్లి మంత్రి పదవి కావాలని అడిగా. నీవు యువకుడివి అపుడే నీకు మంత్రి పదవి ఎందుకు? అన్నారు. దీంతో మనస్తాపం చెంది... చెన్నారెడ్డికి వ్యతిరేకంగా మంత్రి రాజారాంకు మద్దతుగా నిలిచా. చెన్నారెడ్డిని తొలగించి టి.అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించాక.. నేను, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన మంత్రివర్గంలో చేరాం.

 
నా పెళ్లి ఎలా కుదిరిందంటే...
అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీతో పాటు పలు శాఖలకు నేను మంత్రిగా ఉన్నా. అపుడు సినిమా డిస్ట్రిబ్యూటర్ హోదాలో ఎన్‌టీఆర్ కుమారుడు జయకృష్ణ  నా దగ్గరకు వస్తుండేవారు. ఆయనే అనురాగదేవత సినిమా షూటింగ్ సమయంలో ఎన్‌టీఆర్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సూచించా. ఈ పరిణామ క్రమంలో జయకృష్ణ తన సోదరిని వివాహం చేసుకొమ్మని ప్రస్తావన తెచ్చారు. మద్రాస్ వెళ్లి భువనేశ్వరిని చూసి ఒకే అనేశా. 

 
బాలకృష్ణ ఇంటిలోకి ఎలా వచ్చానంటే....
పెళ్లి తరువాత ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టా. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 46 సర్కిల్‌లో బాలకృష్ణ కోసం ఇల్లు నిర్మిస్తున్న ఎన్‌టీఆర్ అందులో ఉండాల్సిందిగా కోరారు. నేను వద్దన్నా. మీ మామగారు ఎవ్వరికీ ఇలా చెప్పలేదు, సరేననండి అంటూ మా అత్త బసవతారకం సూచించారు. నేను పట్టించుకోలేదు. ఏడాది తరువాత అదే ఇంటిలో నేను చేరాల్సి వచ్చింది.

 
లోకేష్ వద్దన్నాడు..
ఐక్య కూటమి కన్వీనర్‌గా ఉన్నపుడు ప్రధాని పదవి చేపట్టమని సీపీఎం సీనియర్ నేత జ్యోతిబసును కోరా. అయితే ఆ పార్టీ నేతలు అందుకు అంగీకరించలేదు. దీంతో నన్ను చేపట్టమని కోరారు. అప్పుడు నా కుమారుడు లోకేష్ పదో తరగతి చదువుతున్నారు. ప్రధాని పదవి తీసుకోమంటావా? అని అడిగా. తాత్కాలిక ఉద్యోగం (పీఎం పదవి) ఎందుకు.. పర్మినెంట్ పదవి (సీఎం)నే ఉంచుకోండి అని చెప్పారు. దాంతో ప్రధాని పదవిని తిరస్కరించా.

 
కలాం ఎంపిక ఎలా జరిగిందంటే....
రాష్ర్టపతి అభ్యర్థిగా పీసీ అలెగ్జాండర్ పేరును ఎంపిక చేసినట్లు ప్రధాని వాజ్‌పేయి ఫోన్ చేసి చెప్పగా నాకు ఆమోదయోగ్యం కాదన్నా. అంతకు కొద్ది రోజుల ముందు నేను తయారు చేసిన విజన్ 2020 డాక్యుమెంట్ గురించి తెలుసుకుని వచ్చి మాట్లాడిన కలాం గుర్తొచ్చారు. వెంటనే ప్రధానికి ఫోన్ చేసి ఆయన పేరు ప్రతిపాదించా. ఇతర పార్టీల వారు పోటీ కూడా పెట్టరని చెప్పి కలాంను ఒప్పించా.

 ‘హోదా’ వస్తే ఏమొస్తుంది?
ప్యాకేజీ వద్దంటే అభివృద్ధికి ఆటంకం: మండలిలో ఏపీ సీఎం చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఏమొస్తుంది? హోదా ఇచ్చిన హిమాచల్ ప్రదేశ్ ఏమైంది? ఒకసారి ఆర్‌బీఐ రిపోర్ట్స్ చదవండి... అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన మండలిలో శనివారం సభ్యులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి హోదా అంటే అంతేనా? అంటూ సీఎంను సీపీఐ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. ‘హోదా ఏ రాష్ట్రానికీ ఇచ్చేది లేదని కేంద్రం చెబుతోంది. ప్రత్యేక హోదా వల్ల ఐదేళ్లకు ఎంత వస్తుందో ప్యాకేజీ కింద కూడా అంతే డబ్బు ఇస్తామంటున్నారు. ప్యాకేజీ ద్వారా రూ.20 వేల కోట్లు వస్తుందని అంచనా వేశాం.

వాటికనుగుణంగానే అభివృద్ధి పనులకు అప్పుడే ప్రణాళికలను కూడా తయారు చేశాం. తద్వారా ఇరిగేషన్, తాగునీరు, రోడ్లు తదితర పనులన్నీ పూర్తి చేయడానికి ఆ నిధులు ఉపయోగపడతాయి. ప్రజల కోసం ఎవరెన్ని మాటలు మాట్లాడినా బాధను దిగమింగుకొని భరిస్తాను. ప్యాకేజీ కూడా వద్దంటే అభివృద్ధి పనులు కుంటుపడితే మీలా గ్రామాల్లో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలా? ప్యాకేజీ వద్దని పోలవరం ప్రాజెక్టును ఆపుకోమంటారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక రిక్షా పుల్లర్ సూచనలు ఇచ్చినా స్వీకరిస్తానని, అంతేగానీ రాజకీయాలకోసం ప్యాకేజీ కూడా వద్దంటూ ఒత్తిడి తెస్తే ఒప్పుకోనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో సమస్యలే లేవు... రెండేళ్లలో ఏమి లోటు వచ్చిందో చెప్పండి? అంటూ సీఎం మండలి సభ్యులను ప్రశ్నించారు.


సెల్ఫీలు, ఫొటోలు..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి   సమావేశాలు హైదరాబాద్‌లో జరగటం ఇదే చివరిసారని చంద్రబాబు ప్రకటించిన నేపధ్యంలో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడ్డారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే అసెంబ్లీ, కౌన్సిల్ హాల్‌లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారు. తన వద్దకు వచ్చి ప్రతి ఒక్కరితో ఆయన ఫొటోలు దిగారు. హైదరాబాద్‌లో ఇవే చివరి సమావేశాలు కావటంతో తీపి గుర్తుగా మిగిల్చుకునేందుకు ఫొటోలు దిగుతున్నామని పలువురు తెలిపారు.

మరిన్ని వార్తలు