జూన్ 27న తరలింపు అనుమానమే!

8 May, 2016 00:59 IST|Sakshi
జూన్ 27న తరలింపు అనుమానమే!

సీఎస్ నిర్వహించిన సమీక్షలో స్పష్టత కరువు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతిలో చేపట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణం, ఉద్యోగుల తరలింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. జూన్ 27న ఉద్యోగులను తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కనిపించడంలేదు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ఎప్పటికి పూర్తమతుందో ఎవ్వరికీ స్పష్టతలేదు.అక్కడ రెండు ఫోర్లు జూలై నెలాఖరు లేదా ఆగస్టు  నాటికి పూర్తవుతాయంటున్నా, అదనంగా మరో రెండు ఫ్లోర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వీటితోపాటు ఇతర వసతుల కల్పన పనులను అడ్డదారిలో అస్మదీయులకు కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నాలకు సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్ జైన్ గండికొట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టెండర్లు పిలిచి ఈ నెలాఖరుకు ఖరారు చేయనున్నారు. ఈ నిబంధనల్లోనే ఆరు నెలలు సమయం పడుతుందని, అదనంగా మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.మే నెలాఖరులో టెండర్లను ఖరారు చేస్తే నవంబర్‌కు నిర్మాణం పూర్తి కావాలి. ఆ గడువును 2017 జనవరి వరకూ పొడగించవచ్చు. అప్పటికీ నిర్మాణాలు పూర్తవుతాయన్న నమ్మకం లేదు.

ఈ నేపథ్యంలో ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఉద్యోగులు తరలివెళ్లేలా చర్యలను చేపట్టాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగుల తరలింపునకు మార్గదర్శకాల ఖరారుకు ఈ సమీక్ష జరిపారు.నిర్మాణం పూర్తిపై ఈ సమీక్షలోనూ స్పష్టత కొరవడటంతో ఉద్యోగుల తరలింపుపై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై సీఆర్‌డీఏ కమిషనర్‌ను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. బ్యాచులర్, , కుటుంబ వసతి ఎంతమందికి కావాలనే వివరాలను తీసుకుని, అందుకు తగినట్లు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.
 
అడ్డగోలు నిర్ణయాలవల్లనే ఆలస్యం
తాత్కాలిక రాజధాని హైదరాబాద్‌లో ఐదేళ్లుంటామని చెప్పిన సీఎం చంద్రబాబు  ఓటుకు కోట్లు కేసు తర్వాత ఒక్కసారిగా ఉండవల్లికి చేరిన సంగతి తెలిసిందే. అక్కడ కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించి లింగమనేని గెస్ట్‌హౌస్‌ను తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు.అక్కడినుంచే పరిపాలిస్తూ... సచివాలయ ఉద్యోగులను జూన్ 27 నాటికి తరలిస్తామని ప్రకటించారు.

ఒకవైపు 2018 నాటికి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూనే మరోవైపు అస్మదీయులకు లాభం చేకూర్చేలా తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి దాదాపు రూ.వెయ్యికోట్లు ఖర్చుపెడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాత్కాలిక సచివాలయం కోసం మొదట రెండు ఫ్లోర్లు నిర్మించాలని తలపెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత అదనంగా మరో రెండు ఫ్లోర్లు నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ అదనపు ఫ్లోర్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలకు కల్పనకు టెండర్లు లేకుండా నామినేషన్‌పై ఇచ్చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. తద్వారా అస్మదీయులు అడ్డదారిలో పనులు కట్టబెట్టి లాభం చేకూర్చాలని ప్రయత్నించారు.

అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదని, నామినేషన్‌పై పనులు ఇవ్వడానికి సంతకం చేయబోనని సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్ జైన్ కరాఖండిగా చెప్పారు. దీంతో మరో మార్గం లేకపోవడంతో ఈ నెల 2వ తేదీన రెండు ప్యాకేజీలుగా విడగొట్టి రూ.574 కోట్ల పనులకు టెండర్లను పిలిచారు. ఈ టెండర్లను ఈ నెలాఖరుకు ఖరారు చేయనున్నారు. ఈ టెండర్ల నిబంధనల్లోనే ఆరు నెలలు సమయం పడుతుందని, అదనంగా మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు 2017 జనవరి నాటికి కూడా నిర్మాణాల పూర్తవడం అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తరలింపు కూడా వాయిదా వేయక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
తరలింపు మార్గదర్శకాలు ఖరారు
వెలగపూడి సచివాలయానికి తరలింపులో ఏ కేటగిరీ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలి, హైదరాబాద్ సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగులను ఉంచాలనే అంశాలకు సంబంధించి మార్గదర్శకాలను సమీక్షలో సీఎస్ ఖరారు చేశారు. హైకోర్టు, పరిపాలన ట్రిబ్యునల్, స్టాట్యుటరీ కమిషన్స్, పదవ షెడ్యూల్ సంస్థలను పర్యవేక్షిస్తున్న సెక్షన్లకు చెందిన ఉద్యోగులను హైదరాబాద్‌లోనే ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉండిపోయేవారు లేదా తరలింపునుంచి మినహాయింపు పొందినవారి వివరాలిలా ఉన్నాయి.

* స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన ఆన్‌లైన్ డేటాకు సంబంధించిన కంప్యూటర్ వ్యవస్థను పర్యవేక్షించే సిబ్బంది హా  సచివాలయంలో పనిచేస్తూ ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు ముందు పదవీ విరమణ చేయనున్న ముగ్గురు ఏఎస్‌ఓలు, నలుగురు ఎస్‌వోలు, ఏడుగురు అదనపు, సంయుక్త, డిప్యూటీ కార్యదర్శులు  హా     జన్యుపరమైన వ్యాధులతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు. కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న, డయాలిసిస్ పొందుతున్న ఉద్యోగులు.  

* పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగులకు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లడం సమస్యగా మారింది. బాలికను దత్తత ఇచ్చిన సంస్థ ప్రతీ రోజు ఇంటికి వచ్చి పర్యవేక్షణ చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో వెలగపూడి తరలివెళ్లడం సాధ్యం కాదని సచివాలయ ఉద్యోగిని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఇలాంటి దరఖాస్తులను పరిశీలించడానికి ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, వారికి తరలింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు