సెప్టెంబర్ 13 నుంచి గ్రూపు-1 మెయిన్స్

7 Aug, 2016 02:15 IST|Sakshi
సెప్టెంబర్ 13 నుంచి గ్రూపు-1 మెయిన్స్

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఆ పరీక్షకు సంబంధించి 140 పోస్టులు తెలంగాణకు వచ్చాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటి భర్తీకి మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 13 నుంచి 23వరకు పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 312 పోస్టుల భర్తీకి 2011లో అప్పటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే గ్రూపు-1 ప్రిలిమ్స్ కీలో ఆరు తప్పులు దొర్లాయని, వాటి వల్ల తాము నష్టపోయామని, మెయిన్స్‌కు అర్హతను కోల్పోయామని పేర్కొంటూ పలువులు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట ట్రిబ్యునల్, ఆ తరువాత హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టులో 150 ప్రశ్నల్లో ఆరు తప్పులు దొర్లినట్లు తేలింది. అయితే అప్పట్లో తప్పులు దొర్లాయని అభ్యర్థులు పేర్కొన్నా.. అప్పటి ఏపీపీఎస్సీ పట్టించుకోకుండా మెయిన్స్ నిర్వహించి, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది.

ప్రస్తుతం ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన జరిగినందున 172 పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌లో, 140 పోస్టులకు తెలంగాణలో వేర్వేరుగా మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమోదం తెలపాలని టీఎస్‌పీఎస్సీ.. ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆమోదించడంతో వచ్చే నెలలో పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక అప్పట్లో గ్రూపు-1 ప్రిలిమ్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల తోపాటు 6 ప్రశ్నలను తొలగించగా అదనంగా అర్హత పొందే అభ్యర్థులతో ఈ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. అర్హులకు సంబంధించిన వివరాలు, జాబితాలను అందజేయాలని ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఏపీపీఎస్సీని కోరింది. అవి త్వరలోనే టీఎస్‌పీఎస్సీకి అందనున్నాయి.

>
మరిన్ని వార్తలు