‘విమోచన’పై దూకుడు పెంచిన బీజేపీ

14 Sep, 2016 01:46 IST|Sakshi
‘విమోచన’పై దూకుడు పెంచిన బీజేపీ

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌కు పదును
సాక్షి,హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాలన్న డిమాండ్‌పై రాష్ట్ర బీజేపీ దూకుడును మరింతగా పెంచుతోంది. హైదరాబాద్ స్టేట్ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో కొంత కాలంగా బీజేపీ వివిధరూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు సమీపిస్తుండడంతో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల స్వరాన్ని, సవాళ్ల పర్వాన్ని ఒక్కసారిగా పెంచింది. తిరంగా యాత్ర పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది.

గతంలో టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట మరువడాన్ని ప్రజల్లో ఎత్తిచూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కూడా పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందనే నమ్మకంతో బీజేపీ నాయకత్వం ఉంది. సెప్టెంబర్ 17న  వరంగ ల్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటారు.
 
ప్రభుత్వమే టార్గెట్‌గా కార్యక్రమాలు...
హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి, సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా, ము ఖ్యంగా నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగిన ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. 1948 సెప్టెంబర్ 17న జరిగింది విలీనమా, విమోచనమా, విద్రోహమా అన్న దానితో సంబంధం లేకుండా ఈ ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ అంటోంది. నిజాం వ్యతిరేక  పోరాటంలో ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతాలు, చరిత్రలో స్థానం సంపాదించుకున్న ఘటనలు, వ్యక్తులను గుర్తుచేసుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల గురించి పార్టీపరంగా ప్రచారం చేసేందుకు మహిళా మోర్చా, మైనారిటీ మోర్చా, ఎస్సీ, ఎస్టీ, యువజన మోర్చాలను రంగంలోకి దింపింది.

మరిన్ని వార్తలు