మనవాళ్లకు పెగ్గు చాలదు..ఫుల్లే!

6 Jun, 2016 02:18 IST|Sakshi
మనవాళ్లకు పెగ్గు చాలదు..ఫుల్లే!

మరోసారి సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
 
 విజయవాడ (భవానీపురం):
‘విదేశాల్లో భార్యాభర్తలు గొడవపడితే ఒక పెగ్గు మందు కొడతారు. మనవాళ్లకు పెగ్గు చాలదు. ఫుల్లు లేపేస్తారు..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా శనివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ‘తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు..’ అంటూ సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భార్యాభర్తలు గొడవ పడినప్పుడు ఫుల్లు లేపేయకుండా ఒక మొక్కను నాటాలని సూచించారు. పగలంతా కష్టపడి పనిచేసేవారు సాయంత్రం సమయాల్లో మనసుకు నచ్చిన పని చేయాలన్నారు. అయితే మందు, పేకాట వంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్లవద్దని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం, ప్రశాంతమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలని సూచించారు.

 విద్యుత్ రంగం పరుగులు పెడుతోంది: రాష్ట్ర ప్రజలకు సీఎం బహిరంగ లేఖ
 సాక్షి, హైదరాబాద్: గడచిన రెండేళ్లలో విద్యుత్ రంగం ఎన్నో రెట్లు పురోభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విభజన నాటికి 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే, ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు అమ్మగలిగే స్థాయికి ఎదిగిందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యుత్ పురోభివృద్ధిపై రాష్ట్ర ప్రజలకు సీఎం రాసిన బహిరంగ లేఖను ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఆదివారం మీడియాకు విడుదల చేశారు. కేంద్రం ప్రకటించిన అందరికీ విద్యుత్ పథకంలో రాష్ట్రం చేరడం గర్వకారణమని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.  అంతర్జాతీయ ప్రమాణాలున్న సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకున్నామని తెలిపారు. ఏపీలో సగటు తలసరి విద్యుత్ వినియోగం 951 యూనిట్ల నుంచి 982 యూనిట్లకు పెరిగిందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు