కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఓటేసేందుకు గంట సడలింపు

30 Jan, 2016 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరిగే ఫిబ్రవరి 2వ తేదీన స్థానికంగా ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. పోలింగ్ రోజు ఓటేసేందుకు తమ ఉద్యోగులు ఉదయం లేదా మధ్యాహ్నపు పని వేళల్లో అర్థగంట/గంట పాటు సడలింపు తీసుకోవచ్చని తెలిపింది. పోలింగ్ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని కోరుతూ రాసిన లేఖకు స్పందనగా కేంద్రం నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మకు సమాధానం అందింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల కార్యాలయాల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు పోలింగ్ రోజు విధులకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ప్రైవేటు ఉద్యోగులకు 2న సెలవు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజు ఫిబ్రవరి 2న స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో నివాసం ఉంటూ ఇతరాత్ర ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం పోలింగ్ రోజు సెలవును వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం మెమో జారీ చేశారు. అదే విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్‌కు మరుసటి రోజు ఫిబ్రవరి 3న ఆన్‌డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పిస్తూ మరో మెమో జారీ చేశారు.

మరిన్ని వార్తలు