గురుకులాలన్నింటా ఒకే మెనూ

9 May, 2017 00:57 IST|Sakshi
గురుకులాలన్నింటా ఒకే మెనూ

అధికారులకు ఉపముఖ్యమంత్రి కడియం ఆదేశం
- ప్రతి ఆదివారం నాన్‌వెజ్‌ తప్పనిసరి
- ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీ
- గురుకులాల్లో వసతుల కల్పనపై సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నింట్లో ఒకే రకమైన మెనూ అమలు చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా గురుకులాల వరకు కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌తో పాటు మౌలికవసతుల కల్పనలోనూ ఒకే పద్ధతిని అనుసరించాలని ఆదేశించారు. గురుకులాల్లో వసతుల కల్పన, మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై సోమవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

ఇందులో మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, అజ్మీరా చందూలాల్‌తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్‌మిశ్రా, రంజీవ్‌ ఆర్‌ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈమేరకు గురుకుల సొసైటీల కార్యదర్శులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన రెసిడెన్షియల్‌ కాలేజీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.

ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం
మహిళా డిగ్రీ కాలేజీల్లో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ... వాటిపై స్పష్టత కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కడియం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఒక్కోచోట ఒక రకమైన భోజనాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్న కడియం, ఇకపై ఒకేరకమైన భోజనాన్ని ఇవ్వాలన్నారు. ప్రతి ఆదివారం గురుకుల విద్యార్థులకు నాన్‌వెజ్‌ భోజనం పెట్టాలన్నారు. గురుకుల విద్యార్థినులకు ఏడాది పాటు అవసరమయ్యే ఆరోగ్య వస్తువులను కిట్‌ రూపంలో ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, వీటికి డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారులను నియమించాలని ముఖ్య మంత్రి భావిస్తున్నారన్నారు. పక్షం రోజుల్లో ఓ నివేదిక ద్వారా స్టడీ సర్కిళ్లపైనా సూచనలు చేయాలన్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రారంభించిన గురుకుల పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న గురుకులాలకు సంబంధించి భవనాలు, విద్యార్థులకు సౌకర్యాలు తదితర అంశాలపైనా పరిశీలన చేపట్టాలన్నారు. కొత్త గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండొద్దని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు