ఔషధ నగరికి మరొక్క అడుగే!

24 Jan, 2018 02:19 IST|Sakshi

పర్యావరణ అనుమతులపై నేడు కేంద్ర నిర్ణయం

ఢిల్లీలో నిపుణుల కమిటీ కీలక సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఔషధ పరిశ్ర మల స్థాపన కోసం ప్రభుత్వం చేపట్టిన ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతుల జారీపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశముంది. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ (ఎంఓఈఎఫ్‌)ల నేతృత్వంలో ని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఢిల్లీలో సమావేశమవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ నేతృత్వంలో అధికారుల బృందం ఈ సమావే శానికి హాజరై.. ఫార్మాసిటీ ప్రాజెక్టుపై ప్రజెం టేషన్‌ ఇవ్వనుంది. ఈ భేటీలోనే పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ వస్తే.. త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఒకవేళ ఈఏసీ అదనపు సమాచారం కోరితే.. తదుపరి నిర్వహించే ఒకటి, రెండు సమా వేశాల్లో పర్యావరణ అనుమతులు లభించే అవకాశాలున్నాయి. ఫార్మాసిటీ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్‌ 9న తొలిదశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టరమ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌)’ జారీ అయ్యాయి.

19,333.2 ఎకరాల్లో..
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలాల పరిధిలోని 19,333.2 ఎకరాల విస్తీర్ణంలో, రూ.16,784 కోట్ల అం చనా వ్యయంతో ఫార్మాసిటీని చేపట్టారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో... ‘నేషనల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)’గా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఔషధ ఆవిష్కరణలు, అభివృద్ధి, తయారీ, సరఫరా, మార్కెటింగ్‌కు అవసర మైన అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. ప్రాజెక్టుకు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. 5.56 లక్షల మందికి ఉద్యోగావ కాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఏటా రూ.1.4 లక్షల కోట్ల విలువైన ఔషధాల ఉత్పత్తి, అందులో రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాసిటీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభు త్వం ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రచారం నిర్వహిస్తోంది. ప్రాజెక్టుకు 985 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని అంచనా.

వేగంగా భూసేకరణ
ఫార్మా సిటీ ప్రాజెక్టుతో యాచారం మండలం మేడిపల్లి, కుర్మిడ్డ, నానక్‌నగర్, తాడిపర్టి, కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్, ముచ్చర్ల, పంజగూడ, కడ్తాల్‌ మండలం ముద్విన్, కార్కడల్‌ పహాడ్, కడ్తాల్‌ గ్రామాల్లో 3,747 కుటుంబాలు భూములు కోల్పోతు న్నాయి. గతేడాది అక్టోబర్‌ 11న రాష్ట్ర ప్రభు త్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఇప్పటివరకు 2,020 నిర్వాసిత కుటుంబాలకు రూ.273.36 కోట్ల పరిహా రాన్ని అందజేసింది. దీంతో 6,812 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగతా 1,727 కుటుంబాలకు పరిహారం చెల్లిం చి.. 12,233 ఎకరా లను సేకరించాల్సి ఉంది. కేంద్ర భూసేకరణ చట్టం–2013కి ప్రత్యామ్నాయం గా.. రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన భూసేకరణ, పునరా వాస చట్టం–2017 కింద ఫార్మా సిటీ ప్రాజె క్టుకు భూసేకరణ జరుగుతోంది.

ఔషధ ఎగుమతులకు ఊతం
దేశంలో ఉత్పత్తవుతున్న ఔషధాలు ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు ఎగుమతి అవుతు న్నాయి. మన ఔషధ ఉత్పత్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్‌. ప్రపంచవ్యాప్తంగా జరుగు తున్న జనరిక్‌ ఔషధాల ఎగుమతుల్లో 20 శాతం వాటా మన దేశానిదే. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీతో ఔషధ ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయి. ఏటా ఫార్మాసిటీ నుంచి రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అవుతాయని అంచనా వేస్తున్నారు.

ఔషధ మిశ్రమాలు ఉత్పత్తి 
ఔషధ ఉత్పత్తి పరిశ్రమలకు హైదరాబాద్‌ ఖ్యాతి గడించినా.. ఔషధాల తయారీలో వినియోగించే రసాయన మిశ్రమాల (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రేడి యంట్స్‌– ఏపీఐ)ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటు న్నారు. ముఖ్యంగా 60–70 శాతం ఏపీఐలు చైనా నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నా, ఇతర కారణాలతో సరఫరా ఆగినా.. ఫార్మా పరిశ్రమలకు ఇబ్బందులు తప్పవు. బీజింగ్‌ ఒలింపిక్స్‌కు ముందు పర్యావరణ కారణాలతో చైనా ప్రభుత్వం పెన్సిలిన్‌ ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసింది. దాంతో ‘పెన్‌–జీ’ఔషధ మిశ్ర మం సరఫరా నిలిచిపోయి హైదరాబాద్‌లోని ఫార్మా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ఫార్మాసిటీ ఏర్పాటుతో ఇలాంటి సమస్యలకు చెక్‌ పడనుంది. స్థానిక పరిశ్రమలకు అవసరమైన ఏపీఐలను ఫార్మాసిటీలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్రాజెక్టు ప్రణాళికల్లో చేర్చింది. ఈ రంగంలో సైతం భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఫార్మా సిటీలో ఉత్పత్తయ్యే ఔషధాలివీ

ఫార్మా సిటీలో పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్స్‌ వంటి యాంటీ బయాటిక్‌ ఔషధాలు ఉత్పత్తికానున్నాయి. వివిధ రకాల సింథటిక్‌ డ్రగ్స్, సల్ఫర్‌ డ్రగ్స్, యాంటీ ట్యూబర్‌క్యులోసిస్, యాంటీ లెప్రోటిక్‌ డ్రగ్స్, అనాలజిస్టిక్స్, అనెస్థిటిక్స్, యాంటీ మలేరియా ఔషధాలు, పారాసెటమాల్, మెటాఫార్మిన్, ఇబుప్రోఫిన్, విటమిన్స్, వెజిటబుల్‌ ఆరిజిన్‌ డ్రగ్స్, వ్యాక్సిన్లతోపాటు ఆయుర్వేద ఔషధాలు కూడా ఉత్పత్తి కానున్నాయి.

ఫార్మా విశ్వవిద్యాలయం కూడా..

ఫార్మాసిటీని మొత్తంగా 19,333 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుండగా.. అందులో 9,535 ఎకరాల్లో పరిశ్రమల కోసం కేటాయించారు. ఇందులో 4,517 ఎకరాల్లో తీవ్ర కాలుష్య కారక (రెడ్‌), 2,480 ఎకరాల్లో కాలుష్య కారక (హైబ్రిడ్‌), 1,933 ఎకరాల్లో స్వల్ప కాలుష్య కారక (ఆరెంజ్‌), 605 ఎకరాల్లో కాలుష్య రహిత (గ్రీన్‌) పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఇక ఫార్మా సిటీ ఉద్యోగుల కోసం 1,507 ఎకరాల్లో రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్, 322 ఎకరాల్లో ఫార్మా విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తారు. అదే విధంగా పబ్లిక్, సెమీ పబ్లిక్‌ అవసరాలకు 1,111 ఎకరాలు, కార్యాలయాలకు 544 ఎకరాలు, పరిశోధనలకు 827 ఎకరాలు, గ్రీన్‌ బెల్ట్‌కు 3,205 ఎకరాలు, రోడ్ల నిర్మాణానికి 1,779 ఎకరాలు, లాజిస్టిక్‌ (రవాణా) హబ్‌కు 203 ఎకరాలు, ఆస్పత్రికి 104 ఎకరాలు, హోటల్‌కు 141 ఎకరాలను కేటాయించారు. 

కాలుష్య పరిశ్రమలు నగరం బయటికి..

పలు ఔషధ పరిశ్రమల నుంచి హానికర రసాయన వ్యర్థాలు విడుదలవుతుంటాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలుచోట్ల జనావాసాలకు సమీపంలో అలాంటి పరిశ్రమలు ఉన్నాయి. ఇలాంటి సుమారు 81 ఔషధ పరిశ్రమలను నగరం అవతలకు తరలించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇప్పుడా పరిశ్రమలన్నీ ఫార్మాసిటీకి తరలనున్నాయి. ఇక కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల మేరకు.. జల, వాయు, శబ్ద, భూ కాలుష్యాలను నివారించేందుకు ఫార్మాసిటీ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. రసాయన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు అత్యాధునిక ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
 

మరిన్ని వార్తలు